
డీమానిటైజేషన్: ఫోర్బ్స్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ డీమానిటైజేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అనైతికమని, ప్రజల సొత్తును దోచుకోవడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న దిగ్భ్రాంతికర చర్య ప్రజల ఆస్తులనుభారీగా దొంగిలించడంగా పేర్కొన్న ఫోర్బ్స్.. 1975-77 లో ఎమర్జన్సీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమంతో (ఫోర్స్డ్-స్టెరిలైజేషన్ డ్రైవ్) పోల్చింది.
నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారతదేశం ఆర్థికవ్యవస్థను, భవిష్య పెట్టుబడులను దెబ్బతీసిందని ఫోర్బ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీవ్ ఫోర్బ్స్ పేర్కొన్నారు.కరెన్సీ రద్దు చేయడం అంటే సామాన్యుడి గోప్యతపై దాడిచేయడమన్నారు. ప్రభుత్వం చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా కోట్లాదిమంది పేదల్ని మరింత భయాందోళల్లోకి నెట్టివేసిందనీ,ఇది అనైతికమని పేర్కొన్నారు. అంతేకాదు కరెన్సీ రద్దు చేసినంత మాత్రాన టెర్రరరిస్టులు తమ దుర్మార్గపు పనులను వదిలి పెట్టరని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛా మార్కెట్లకు అనుమతి ఉంటేనే డిజిటైజేషన్ సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా 85 శాతం చలామణీలో ఉన్న నోట్లను రద్దు చేసి, సామాన్య ప్రజానీకాన్ని అత్యంత ఇబ్బందుల్లోకి నెట్టివేసిందన్నారు.
తాజా కఠినమైన నిర్ణయాలు, పన్నుల విధానంపై కూడా పత్రిక మండిపడింది. చట్టబద్దమైన వ్యాపారాన్ని సులువు చేసి వ్యాపార అవకాశాలను మరింత అందుబాటులోకి తేవాలన్నారు. మొత్తం పన్నుల విధానం సరళీకృతం చేయాలని ఆదాయ,వ్యాపార పన్నులను మరింత తగ్గించాలని మాగజీన్ సూచించింది. పన్నుల ఎగవేతకు పరిష్కారంగా ఎంత తక్కువ పన్ను రేటు ఉంటే అంతమంచిదని తెలిపింది. దేశీయ కరెన్సీ మరింత బలోపేతం చేయాలని కోరింది.