భారీగా తగ్గిన ఆ కారు ధర!
ఓ వైపు కార్ల ధరలు పెంచుతూ వినియోగదారులకు కాక పుట్టిస్తుంటే .. ఆశ్చర్యకరంగా ఫోర్డ్ కంపెనీ కార్ల ధరలను భారీగా తగ్గించేసింది. ఎంత అనుకుంటున్నారా..? ఏకంగా రూ.2.82 లక్షల మేర తన ఎండీవర్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించేసింది. ఈ ధరల తగ్గింపును ట్రెండ్ వేరియంట్ కొనుగోలుదారులు వినియోగించుకునేలా అవకాశం కల్పించింది. టైటానియం వేరియంట్స్ ధరలను మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అలాగే ఉంచేసింది. ఆగస్టు మొదట్లోనే ఈ అమెరికా కారు తయారీదారి ఫిగో హ్యాచ్, ఆస్పైర్ సెడాన్లపై రూ.91వేల వరకు ధరను తగ్గించింది. అదేనెలల్లో ఎండీవర్లపై రూ.1.72లక్షల వరకు కోత విధించింది. కానీ అదే సమయంలో పరిమితంగా టైటానియం వెర్షన్లపై ధరలను పెంచింది. కొత్తగా ఎండీవర్ ట్రెండ్ వేరియంట్లపై రూ.2.82 లక్షల వరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
ఎస్యూవీల అమ్మకాలను విపరీతంగా పెంచడానికి ఫోర్డ్ ఎండీవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ధరల తగ్గింపు కేవలం అమ్మకాలను పెంచడానికి మాత్రమే కాక, తన ప్రత్యర్థి టయోటా ఫార్చ్యునర్ నవంబర్లో తీసుకు రాబోతున్న కొత్త వాహనాలకు పోటీ ఇవ్వడానికి కూడా ఓ కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో ధరల తగ్గింపు అనంతరం ఎండీవర్ కార్లు సరసమైన ధరల్లో మార్కెట్లో లభించనున్నాయి. ఫోర్డ్ ఎండీవర్ ట్రెండ్ 4x4 మాన్యువల్, ట్రెండ్ 4x2 ఆటోమేటిక్ వేరియంట్లపై ఈ ధరల తగ్గింపు ఎక్కువగా ఉండటం విశేషం. ఎండీ ఫాలోవర్స్కు కానుకగా తీసుకొచ్చిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్, వినియోగదారులు కార్ల కొనుగోలుకు మంచి అవకాశంగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది.