బీజేపీలోకి ఏపీ మాజీ గవర్నర్?
Published Wed, Jan 18 2017 11:15 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేసి, అత్యంత అవమానకరమైన పరిస్థితుల మధ్య ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎన్‌డీ తివారీ.. ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన తివారీ, తన కొడుక్కి టికెట్ ఇప్పించుకోవడం కోసమే బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన తన కుమారుడు రోహిత్ తివారీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ టికెట్ వస్తుందని ఆశించారు. ఎలాగైనా అతడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సముచిత స్థానం కల్పించాలన్నది వృద్ధ తివారీ ఆశ.
కానీ, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం రోహిత్ తివారీకి టికెట్ ఇవ్వడానికి ససేమిరా అందని, దాంతో ఆయన బీజేపీ వైపు దృష్టిపెట్టారని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ కాకపోయినా, ఉత్తరాఖండ్‌లో అయినా తన కొడుక్కి ఓ టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించలేదు. దాంతో ఒక అవకాశం ఉంటుందని తివారీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ అయినా ఆయనను ఆదరిస్తుందా.. లేదా అన్న విషయం ఇంకా తెలియట్లేదు.
Advertisement