
‘సైకిల్ గుర్తు రద్దు’పై ఈసీ స్పందన..
సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌పై నడుస్తోన్న వివాదంపై ఎన్నికల కమిషన్ స్పందించింది..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ రెండుగా చీలిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్‌పై వివాదం చెలరేగడం, ఆ గుర్తు తమకే కేటాయించాలని ఇరు పక్షాలూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ స్పందించారు. బుధవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధిచిన నోటిఫికేషన్‌ను జారీచేసిన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. (ఈసీ ముంగిట్లో ‘సైకిల్’ పంచాయితీ)
‘వివాదాల నేపథ్యంలో సైకిల్ గుర్తును రద్దుచేస్తారా?’అన్న విలేకరుల ప్రశ్నకు ఈసీ వ్యూహాత్మకంగా బదులిచ్చారు. ‘‘ప్రస్తుతానికి’ అలాంటి ఆలోచన ఊహాజనితమే’నని వ్యాఖ్యానించారు. ములాయం సింగ్‌తోపాటు, అఖిలేశ్ వర్గం నుంచి రాంగోపాల్ యాదవ్‌లు ఈసీని సంప్రదించారని, ఎన్నికల గుర్తు తమకే కేటాయించాలని ఇరు వర్గాలూ సంబంధిత పత్రాలు సమర్పించారని జైదీ చెప్పారు. గతంలో ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు ఈసీ వెల్లడించిన నిర్ణయాలను, వాటికి సంబంధించిన చట్టాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత.. సైకిల్ గుర్తుపై సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు. (వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న అఖిలేశ్.. ‘గుర్తు’పైనే గురి)