న్యూఢిల్లీ : ఈ ఏడాది ఎక్కువగా హెడ్లైన్స్లో నిలిచింది ఎవరూ అంటే? ప్రధాని నరేంద్రమోదీనేనట. ఉగ్రవాదంపై పోరుకు నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్ చేసినప్పటి నుంచి దేశ ప్రజలందరిన్నీ ఆశ్చర్యపరుస్తూ పెద్ద నోట్ల రద్దు చేయడం వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ సంచలనాలే. ఈ సంచలన ప్రకటనలతో 2016లో ఎక్కువగా హెడ్లైన్స్లో ప్రధాని మోదీనే నిలిచారని వెల్లడైంది.
డీమోనిటైజేషన్: బ్లాక్మనీపై సర్జికల్ స్టైక్ చేస్తూ నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం జరిగిన పరిణామాలతో వార్తల్లో హెడ్లైన్స్గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఎక్కువగా నిలిచాయి. ఒక్క పత్రికలు, టెలివిజన్లకే పరిమితం కాకుండా, ప్రధాని మోదీ నిర్ణయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ నిర్ణయాలతో త్వరలో జరుగబోతున్న కీలకమైన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీకి సవాల్గా మారనున్నాయట.
సర్జికల్ స్ట్రైక్ : నియంత్రణ రేఖ దాటి పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ జరిపిన నిర్దేశిత దాడి(సర్జికల్ స్ట్రైక్) ఒక్కసారిగా సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధవాతావరణమే నెలకొనే పరిస్థితి వచ్చింది. ఉడి ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆర్మీ ఈ నిర్దేశిత దాడులు చేసింది. ఈ దాడుల్లో 30 నుంచి 40 ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. సెప్టెంబర్ 29న ప్రెస్కు ఈ విషయాన్ని వెల్లడించేంత వరకు ఈ విషయం గురించి, ఇటు మన దేశానికి కాని అటు పాకిస్తాన్కు తెలియనే లేదు. దాడులు జరిపిన తర్వాత రోజు ఉదయం భారత ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది.
సర్జికల్ స్ట్రైక్, డీమోనిటైజేషన్ అనంతరం 2016లో మేజర్ ఈవెంట్లగా నిలిచిన మరికొన్ని అంశాలు:
19వ ఇస్లామాబాద్ సార్క్ కాన్ఫరెన్స్: టెర్రరిజానికి మద్దతిస్తుందనే కారణంతో ఇస్లామాబాద్లో నిర్వహించే 19వ సార్క్ సమావేశాలను భారత్ బాయ్ కాట్ చేసింది. భారత్ నిర్ణయానికి మద్దతుగా బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గానిస్తాన్లు నిలిచాయి. ఆ దేశాలు కూడా ఆ సమావేశాన్ని బాయ్ కాట్ చేశాయి.
అమెరికా ఎన్నికల డిబేట్స్ :
2016లో జరిగిన మరో అత్యంత కీలకమైన ఈవెంట్ అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అనూహ్య భరితంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయ కెరటం ఎగురవేశారు. ప్రత్యర్థుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, ప్రత్యారోపణలతో ఈ ఎన్నికల ప్రక్రియ ఘట్టం ముగిసింది. ఏడాది కాలంగా సాగిన ఈ ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని సర్వేలే అంచనావేయలేదు. సర్వేలన్నీ హిల్లరీ క్లింటన్ నామ స్మరణం చేశాయి. కానీ హిల్లరీకి షాకిస్తూ ట్రంప్ విజయం సాధించారు.
సమాజ్వాద్ పార్టీలో రచ్చ:
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మొదటి ఫ్యామిలీగా ఉన్న సమాజ్వాద్ పార్టీ ఇంట రాజకీయ సంక్షోభం నెలకొనడం 2016లో ఓ మేజర్ ఈవెంట్. అబ్బాయి, సీఎం అభిలేష్ యాదవ్, బాబాయి శివ్పాల్ యాదవ్లకు మధ్య చెలరేగిన ఈ చిచ్చు ఇప్పటికీ ఆరనే లేదు. పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ వారిద్దరి మధ్య గొడవను సర్దుమణిగేలా చేసినా.. సీట్ల పంపకం విషయంలో మళ్లీ భగ్గుమంటోంది.
రతన్ టాటా వర్సస్ సైరస్ మిస్త్రీ....
24 అక్టోబర్న దేశీయ కార్పొరేట్ చరిత్రలో అనుకోని ఓ సంఘటన జరిగింది. టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్న సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా తొలగిస్తున్నట్టు బోర్డు నిర్ణయించింది. బోర్డు రూంలో నెలకొన్న ఈ వివాదం కోర్టుల దాకా వెళ్లింది. ఆ తర్వాత గ్రూప్ కంపెనీలన్నింటి నుంచి మిస్త్రీని బయటికి గెంటేయడం, మిస్త్రీకి మద్దతుగా నిలిచిన నస్లీ వాడియాకు టాటా చెప్పడం వెనువెంటనే జరిగిపోయాయి. కానీ ఈ వివాదం కార్పొరేట్ చరిత్రనే కుదిపేసింది. ఎంతో ప్రతిష్ట కల్గిన టాటా గ్రూప్ ప్రతిష్టను వీధికీడ్చింది.
కావేరి జలాల వివాదం:
వందేళ్లకు పైగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం మళ్లీ భగ్గుమంది. తమిళనాడుకి కావేరి నదీ జలాలను విడుదల చేయాలని సుప్రీం ఆదేశాలతో కర్ణాటక రైతులు నిరసనలు ప్రారంభించారు. అనంతరం ఇరు రాష్ట్రాలు నిరసనలతో అట్టుడికిపోయాయి.
శాంసంగ్ నోట్ 7 సంక్షోభం:
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నోట్ 7 శాంసంగ్ను నష్టాల్లో ముంచెత్తింది. అనుకోకుండా ఈ ఫోన్లు పేలడం ప్రారంభించాయి. పేలుళ్ల ప్రభావిత ఫోన్లను రీప్లేస్ చేసినప్పటికీ, ఈ ఘటనలు మాత్రం ఆగలేదు. దీంతో ఎంతో కాలంగా మంచి పేరును సంపాదించిన శాంసంగ్, ఇరక్కాటంలో పడింది. ఇదే ఆపిల్ ఐఫోన్7కు అవకాశంగా మారింది. స్మార్ట్ఫోన్ శాంసంగ్ ఫోన్ల రీకాలే అతిపెద్ద రీకాల్.