వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
- ‘ఓటుకు కోట్లు’తో బాబు అడ్డంగా దొరికిపోయారు
- టీఆర్‌ఎస్ సర్కారు తెచ్చిన కొత్త పథకాలేమీ లేవు
- వైఎస్సార్ పథకాలకే పేరు మార్చి అమలు చేస్తున్నారని వ్యాఖ్య
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అవినీతికి అడ్రస్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ‘ఓటుకు కోట్లు’తో అడ్డంగా దొరికిపోయాడని.. విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు ముఖం చూడకుండా ఉన్నందుకు తెలంగాణ ప్రజలు సంతోష పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలోని గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రెండో రోజు (ఆదివారం)న ఆయన పార్టీ సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. మాట్లాడారు.
‘‘ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి చంద్రబాబు.. నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉందంటూ బెదిరించారు. మరి చంద్రబాబుకు ఏసీబీ ఎక్కడుం ది. బ్రీఫ్డ్ ఇంగ్లిష్ ముఖ్యమంత్రి చంద్రబాబు. సిగ్గు, శరం విడిచి విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. మూడేళ్లలో రూ.3 లక్షల 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు..’’అని గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు అంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని స్థాయిలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి చేశారని.. తెలంగాణ రాష్ట్రంలోనూ వైఎస్సార్‌సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని చెప్పారు. వైఎస్ తెలంగాణలో 34కు పైగా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారని.. నీళ్లులేక, పంటలు పండక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్ ఇచ్చారని తెలిపారు. వైఎస్సార్ సిద్ధాంతం విశ్వజనీయమైందని.. అన్ని రాష్ట్రాల సీఎంలు వైఎస్సార్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడం దానికి నిదర్శనమని అన్నారు.
సంక్షేమ పథకాలు అణగారిపోతున్నాయి..
అందరికీ ఉపయోగపడేలా వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. తెలంగాణలో సరిగా అమలు కావటం లేదని గట్టు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కొత్తగా తెచ్చిన పథకాలేమీ లేవని.. వైఎస్సార్ పథకాలకే పేరు మార్చి కొన్నింటిని అమలు చేస్తున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతన బకాయిలు భారీగా పేరుకుపోయి ఉన్నాయన్నారు. అణగారిన వర్గాల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఏపీలో 2.5 లక్షల ఎకరాల భూములను అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు పంపిణీ చేశారని... కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ భూములను గిరిజనుల నుంచి లాగేసుకుంటోందని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో సాగుతున్న రాక్షస, అవినీతి పాలనకు చరమగీతం పాడాలన్నారు.
కేసీఆర్, బాబు ప్రజావ్యతిరేక విధానాలు: రాఘవరెడ్డి
ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఇరు రాష్ట్రాల్లోనూ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని.. ఎస్టీ, మైనార్టీల అదనపు రిజర్వేషన్ హామీలకు అతీగతీ లేదని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చే అంశాన్ని గాలికొదిలేశారన్నారు. బాబు ‘ఓటుకు కోట్లు’కేసు ముందుకు సాగడం లేదని, ఇద్దరు చంద్రులు లోపాయకారీ ఒప్పందానికి వచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, ప్రాజెక్టులు కేసీఆర్ కుటుం బానికి ఆదాయ వనరులుగా మారాయన్నారు.
తెలంగాణలో రాజ్యమేలుతున్న అవినీతి
టీఆర్‌ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కె.నగేశ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. నకిలీ విత్తనాలు రైతుల పాలిట శాపంగా మారాయని.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు అందడం లేదని వాపోయారు. పేదలు, ధనికులు, రైతులు, కార్మికులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిది అని.. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కింద తెలంగాణ లో 14.72 లక్షల మంది పేదలు శస్త్రచికిత్సలు చేయించుకున్నారని చెప్పారు.
వాగ్దానాల అమలులో టీఆర్‌ఎస్ విఫలం: శివకుమార్
టీఆర్‌ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ‘టీఆర్‌ఎస్ మేనిఫెస్టో – ప్రభుత్వ వైఫల్యాలు’అంశంపై ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం మాట్లాడారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, కానీ రాష్ట్రాన్ని అధోగతి వైపు తీసుకెళ్తున్నారని శివకుమార్ ఆరోపించారు. కేసీఆర్ మాటల గారడీ తప్ప.. తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో 2,256 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.
లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. మరి ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు 2.6 లక్షల ఇళ్లు నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలికారని.. ఇప్పటివరకు 10 శాతం ఇళ్లకు కూడా టెండర్లు ఖరారు కాలేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. రెండు లక్షల ఇళ్లకు వెంటనే టెండర్లు పిలిచి, నిర్మాణం పూర్తి చేయాలన్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ప్రజల కోసం, రెండు రాష్ట్రాల ప్రజల బాగు కోసం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.