- వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో తెలంగాణ మైనార్టీ నేత రెహమాన్
- చంద్రబాబు,ఫిరాయింపుదారులపై విమర్శలు
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినా తమ గుండెల్లో కొలువున్నారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ చెప్పారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని వైఎస్సార్ ప్రాంగణంలో శనివారం పార్టీ మూడో జాతీయ ప్లీనరీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ తమ గుండెల్లో ఉన్నారని, నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారంటున్నారు. చార్మినార్ కట్టారా? మక్కా మసీద్ కట్టారా? అసెంబ్లీని కట్టించారా? డ్రైనేజీ కూడా సరిగా లేని హైటెక్ సిటీ కట్టించి అంతా తాను చేశానని చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు.
పార్టీ మారిన వారికి సిగ్గు, లజ్జ లేదు, జలీల్‌ఖాన్, కదిరి చాంద్‌బాషాలు దొంగలు, వారి తండ్రులు, తాతలు కూడా దొంగలని విమర్శించారు. తాను తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో చంద్రబాబు ఇంగ్లిష్‌లో మాట్లాడితే అలా ఉంటుందని నవ్వులు పూయించారు. తొలుత మధ్యాహ్నం 12.05కు పార్టీ జెండాను ఆవిష్కరించి వేదికపైకి వచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. వేదికపై ముందు వరుసలో కూర్చున్న జగన్ తనకు కుడివైపు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని, ఎడమవైపు శ్రీకాంత్ రెడ్డిని కూర్చోపెట్టుకున్నారు.
సభ ప్రారంభంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడి నుంచి తెచ్చిన అమ్మవారి కంకణాన్ని జగన్ చేతికి కట్టి, అమ్మవారి శాలువా బహూకరించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డిలు మహానేత వైఎస్సార్, పార్టీ అధ్యక్షుడు కలసి ఉన్న భారీ పెయింటింగ్‌ను బహూకరించారు. పార్టీ కార్యదర్శి పుత్తా ప్రతాపరెడ్డి గజమాలతో జగన్‌ను సత్కరించారు. వేదికపైన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, సీఈసీ మెంబర్స్, అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు.
నేడు తెలంగాణ తీర్మానాలు ...
ప్లీనరీ రెండోరోజు ఆదివారం తెలంగాణ నుంచి రెండు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానాన్ని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, టీఆర్‌ఎస్ మేనిఫెస్టో–ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్‌లు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ప్లీనరీకి తెలంగాణ రాష్ట్రం నుంచి వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె. శివకుమార్, కొండా రాఘవరెడ్డి, జి. మహేందర్ రెడ్డి, బోయినపల్లి శ్రీనివాసరావు, మతిన్, సీఈసీ మెంబర్ జి. రాంభూపాల్ రెడ్డి, జిల్లాల అధ్యక్షుడు భగవంత్ రెడ్డి (నాగర్ కర్నూల్), బొడ్డు సాయినాథ్ రెడ్డి (గ్రేటర్ హైదరాబాద్), బెంబడి శ్రీనివాస రెడ్డి (మేడ్చల్), అనిల్ కుమార్ (ఆదిలాబాద్), డాక్టర్ నగేష్ (కరీంనగర్), శాంతికుమార్ (వరంగల్), సుధీర్ బాబు(ఖమ్మం), భాస్కర్ రావు (సూర్యాపేట), పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ (యువజన విభాగం), డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి (వైద్యవిభాగం), బి. వెంకట రమణ (సేవాదళ్), రవికుమార్ (ఎస్సీ సెల్) తో పాటు పార్టీ నాయకులు పాలెం రఘునాథ్ రెడ్డి, అవినాష్ గౌడ్, వేముల శేఖర్ రెడ్డి, బీష్వ రవీందర్, పటాన్ చెరువు చంద్రశేఖర్, విద్యార్థి నాయకులు ఎనుగుల సందీప్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
సంతాప తీర్మానం
జగన్ ఉపన్యాసం అనంతరం పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ మరణించిన వారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్‌కే పురం వాసి బీటీ వెంకటేశ్, ఎల్‌బీ నగర్ నియోజకవర్గం భరత్‌నగర్ డివిజన్‌కి చెందిన సీతమ్మ, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్‌కాలనీకి చెందిన బుచ్చిరెడ్డి, వరంగల్ అర్బన్‌కి చెందిన సెల్ అధ్యక్షుడు రాధాకృష్ణ, వరంగల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సుధీర్ రెడ్డిల ఆకస్మిక మృతికి సంతాపంగా సభికులందరూ మౌనం పాటించారు.