
'హింసలో బాబును మించినోళ్లు లేరు'
హైదరాబాద్: దేశంలో హింసను ప్రేరేపించటంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని మించిన నేత మరొకరు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలోనే పార్లమెంట్ సాక్షిగా కేంద్రంలో ఇప్పటి అధికార, ప్రతిపక్ష నేతలు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి ఆ హామీ అమలు చేయించాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని పేర్కొన్నారు.
అధికార దాహంతో చంద్రబాబు కేంద్రంతో కుమ్మక్కై ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి పదవులు పొందారని త్రీవస్థాయిలో మండిపడ్డారు. శాంతియుత ఆందోళనలను సైతం రక్తపాతంగా మార్చటం బాబుకు వెన్నతో పెట్టిన విద్యేనని, అందుకు హైదరాబాద్ బషీర్ బాగ్ చౌరస్తాలో జరిగిన కాల్పులే నిదర్శనమన్నారు. శాంతియుతంగా జరిగే ఆందోళనలను హింసాత్మకంగా మార్చి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటంలో బాబు దిట్ట అని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు చంద్రబాబును తరిమికొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.