చట్టానికి చేతులు చాలా పొడవైనవని అంటారు. చిన్న వెంట్రుక ముక్క ఉన్నా, గోరు దొరికినా, పన్ను గాట్లు లభించినా కూడా నిందితులెవరో ఇట్టే పట్టుకుని చెప్పగల పరిజ్ఞానం ఇప్పుడు ఉంది. ఇలాంటి పరిజ్ఞానం ఉండబట్టే, ఎప్పుడో పాతికేళ్ల క్రితం జరిగిన అత్యాచారం, హత్య కేసులో డీఎన్ఏ సాక్ష్యం ఆధారంగా జర్మన్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. 1987 నవంబర్ నెలలో జర్మనీలోని ఓస్నాబ్రూక్ నగరంలో తొమ్మిదేళ్ల క్రిస్టీనా అనే అమ్మాయి లైంగిక వేధింపులకు గురైంది. ఆమె స్కూలు బెల్లు వినకపోవడంతో రోజూ అందరితో కలిసి వెళ్లేది, ఒక్కర్తే నడుచుకుంటూ ఇంటికి వెళ్లిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ రెటెమెయర్ తెలిపారు.
కొంచెం చీకటిగా, మొక్కలతో ఉండే అడ్డదారి అయితే త్వరగా ఇంటికి చేరుకోవచ్చని ఆ దారిలో వెళ్లసాగింది. అప్పుడు ఆమెను 19 ఏళ్ల వ్యక్తి ఒకడు అటకాయించాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా, తన తల్లికి చెబుతానని బెదిరించింది. దాంతో అతడు ఆమెను పీకపిసికి చంపేశాడు. అప్పట్లో బాధితురాలి దుస్తులను దాచిపెట్టారు. వాటితోపాటు హంతకుడి చర్మం కొంత భాగం ఆమె గోళ్లలో ఇరుక్కోగా దాన్ని కూడా భద్రపరిచారు. తర్వాత ఇటీవల అతడి డీఎన్ఏను కనుగొని, ఈ కేసును ఓ టీవీ చానల్లోని క్రైం షోలో చూపించారు. దీంతో.. ఆ కార్యక్రమం చూసిన ఓ ప్రేక్షకుడు నిందితుడి గురించి ఉప్పందించాడు. వెంటనే నిందితుడిని డీఎన్ఏ శాంపిల్ ఇవ్వాల్సిందిగా ఆదేశించి, పరీక్షించగా.. అది పాత డీఎన్ఏతో సరిపోలింది. ప్రస్తుతం 45 ఏళ్ల వయసున్న ఆ నిందితుడిని హత్యానేరంతో పాటు.. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు.
పాతికేళ్ల నాటి అత్యాచారం, హత్య కేసులో నిందితుడి అరెస్టు
Published Tue, Sep 17 2013 8:00 PM | Last Updated on Fri, Sep 28 2018 8:12 PM
Advertisement