గోవా... ఈ పేరు చెప్పగానే మంచి వెన్నెలలో.. సముద్ర తీరాన బ్రహ్మాండమైన మందు పార్టీలు, హడావుడే గుర్తుకొస్తాయి. కానీ, ఇవన్నీ గత చరిత్రగానే మిగిలిపోనున్నాయి. ఎందుకంటే, తొందర్లోనే గోవాలో ఉన్న మొత్తం మందు షాపులు, బార్లు అన్నీ రాత్రి తొమ్మిది గంటలకల్లా మూతపడిపోతున్నాయి. ఈ మేరకు గురువారం రాత్రి గోవా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రిపూట మద్యసేవనాన్ని అరికట్టేందుకే ఇలా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ రాత్రి 11 గంటల వరకు గోవాలో మద్యం అమ్ముకోడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని రాత్రి 9 గంటలకు పరిమితం చేశారు.
బార్లు, రెస్టారెంట్లు కూడా ఈ ఉత్తర్వుల పరిధిలోకే వస్తాయని గోవా రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ మెనినో డిసౌజా చెప్పారు. బార్లు, రెస్టారెంట్లలో ఇంతకు ముందు తెల్లవారుజామున ఐదు గంటల వరకు మద్యం అమ్ముకోడానికి వీలుండేదని, కానీ ఇప్పుడు రాత్రి ఒంటిగంట వరకు అమ్ముకోవచ్చు గానీ.. అందుకు ప్రత్యేక అనుమతి తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇంతకుముందు భారీ లైసెన్సు ఫీజులు చెల్లించిన పక్షంలో గోవాలోని బార్లు, రెస్టారెంట్లలో ఉదయం 5 గంటల వరకు మద్యం అమ్ముకోడానికి వీలుండేది. ఇప్పుడు కేవలం 5 స్టార్ రెస్టారెంట్లు, హోటళ్లను మాత్రమే తెల్లవారుజాము వరకు తెరిచి ఉంచడానికి అనుమతిస్తారు.
ఈ చర్య వల్ల, చీప్ లిక్కర్ కోసం గోవాకు తరలివచ్చే లో బడ్జెట్ పర్యాటకుల సందడి కొంతవరకు తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. రాత్రిపూట గోవా బీచ్లలో పరుగులు తీస్తూ మద్యం తాగే పురుషుల వల్ల తమ భద్రతకు ప్రమాదం ఉందని పలువురు పర్యాటకులు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నామన్నారు. దేశంలోనే అత్యంత చవకైన మద్యం గోవాలో దొరుకుతుంది.
గోవాలో అర్ధరాత్రి మందుకు బ్రేక్
Published Fri, Aug 23 2013 1:21 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement