బంగారం భగ్గు ఎగదోసిన రూపాయి పతనం
ముంబై: దేశీయ ప్రధాన బులియన్ మార్కెట్ ముంబైలో పసిడి ధరలు మంగళవారం చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకాయి. దీనికి దేశీయంగా రూపాయి విలువ భారీ పతనమే కాకుండా, అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఈ మెటల్ ధర పరుగు కూడా కారణం. వెండిది కూడా అదే ధోరణి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో నెమైక్స్, బ్రెంట్ ధరలు సైతం భారీగా పెరిగాయి.ముంబైలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర క్రితం ముగింపుతో పోల్చితే 5 నెలల గరిష్ట స్థాయికి చేరింది. రూ.810 ఎగసి రూ.32,730కి ఎగసింది. ఆభరణాల బంగారం ధర రూ.820 ఎగసి రూ. 32,585కు చేరింది. వెండి ధర కూడా భారీగా రూ.1,940 పెరిగి రూ. 56,670 వద్దకు పెరిగింది.
కాగా దేశ వ్యాప్తంగా పలు బులియన్ మార్కెట్లలో పూర్తి స్వచ్ఛత ధర రూ. 31 వేలు దాటిపోయినప్పటికీ, ఆభరణాల బంగారం ధర రూ. 29 వేలు-రూ.30వేల శ్రేణిలోనే విక్రయిస్తుండడం విశేషం. అధిక ధరల వద్ద ఆభరణాల వినియోగదారుల డిమాండ్ మందగించకుండా చూడడం రిటైలర్ల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫ్యూచర్స్‌లో ఇలా...: అటు న్యూయార్క్ మర్కం టైల్ ఎక్స్ఛేంజ్- కమోడిటీ ఎక్స్ఛేంజ్ విభాగంలోసైతం పసిడి, వెండి కమోడిటీలు పరుగులు తీస్తున్నాయి. కడపటి సమాచారం అందేసరికి పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోల్చితే 25 డాలర్లు పెరిగి 1,418 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వెండి కూడా 2% లాభంతో 25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి ధర 5% పైగా లాభంతో (రూ.1,758) రూ.33,614 వద్ద ట్రేడవుతోంది. వెండి 6%కి పైగా ఎగసి(రూ.3,440) రూ.57,227 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే- బుధవారం దేశీయ మార్కెట్‌లో (రూపాయి విలువ కదలికలకు లోబడి) పసిడి, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్రూడ్ ఇలా...: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు మంగళవారం కడపటి సమాచారం అందే సరికి 3%కి పైగా ఎగశాయి. నెమైక్స్ 109 డాలర్ల వద్ద, బ్రెంట్ 114 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.