రికార్డు స్థాయి నుంచి కిందకు దిగిన పసిడి
న్యూఢిల్లీ: పసిడి ధరలు రికార్డుస్థాయి నుంచి గురువారం కిందకు దిగాయి. ఢిల్లీ స్పాట్ బులియన్ మార్కెట్‌లో పూర్తి స్వచ్ఛత, ఆభరణాల బంగారం ధర బుధవారం రికార్డు ధరతో పోల్చితే, రూ.1,575 తగ్గింది. దీనితో ఈ ధరలు వరుసగా రూ.32,325, రూ.32,125కు దిగివచ్చాయి. ఇక వెండి విషయానికి వస్తే, రూ.2,790 పడి, రూ.55,710కి చేరింది. డాలర్ మారకంలో రూపాయి విలువ గణనీయస్థాయిలో బలోపేతం కావడం, ఫ్యూచర్స్ మార్కెట్లలో బుధవారం పసిడి, వెండి ధరలు దాదాపు స్థిర స్థాయిలో ముగియడం దీనికి కారణం.
అధిక ధరలు, ఆయా ఒడిదుడుకుల పరిస్థితుల వద్ద ఆభరణాల కొనుగోళ్లకు వినియోగదారుల నుంచి మద్దతు కొరవడం కూడా ట్రేడింగ్ బలహీనతకు కారణం. కాగా కడపటి సమాచారం అందేసరికి నెమైక్స్ కమోడిటీ డివిజన్‌లో ఔన్స్(31.1గ్రా) ధర స్వల్ప నష్టాల్లో 1,405 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో కూడా ఇదే ధోరణిలో రూ.250 నష్టంలో రూ. 33,120 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఇదిలావుండగా, దేశంలో ప్రధాన స్పాట్ ముంబై బులియన్ మార్కెట్ గురువారం కృష్ణాష్టమి సందర్భంగా పనిచేయలేదు. ఇతర పలు బులియన్ మార్కెట్లలో సైతం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.