సభ్యుల సంఖ్య ఏడుకు కుదింపు
ఎం.ఎం.పల్లంరాజు తొలగింపు
ఆంటోనీ, ఆజాద్, మొయిలీ, జైరాంలకు చోటు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)ను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రెండు రోజుల క్రితమే తొమ్మిది మంది కేంద్ర మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సభ్యులుగా ఏర్పాటైన జీవోఎం సభ్యుల సంఖ్యను ఏడుకు కుదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జీవోఎంలో విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పల్లంరాజుతో పాటు అయిదుగురు మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని తప్పించి కొత్తగా రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ సహా నలుగురికి స్థానం కల్పించారు. సోమవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసిన పల్లంరాజు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. తొలుత జీవోఎంలో సభ్యులుగా నియమితులైన కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, జలవనరుల శాఖ మంత్రి హరీశ్ రావత్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్, విద్యుచ్ఛక్తి శాఖను స్వతంత్రంగా నిర్వహిస్తున్న సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియాలను తప్పించారు. కొత్త జీవోఎంలో స్థానం కల్పించిన మంత్రులలో కేంద్ర రక్షణ మంత్రి ఆంటోనీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి, ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్, పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ ఉన్నారు. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే కొనసాగుతున్నారు. సిబ్బంది వ్యవహారాలను పర్యవేక్షించే సహాయ మంత్రి నారాయణసామి జీవోఎం ప్రత్యేక ఆహ్వానితునిగా వ్యవహరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి హోం శాఖ నోట్‌ను కేబినెట్ సమావేశానికి సమర్పించిన రోజే పది మంది సభ్యులతో విభజన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్ర మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా తీర్మానించిన విషయం తెలిసిందే. విభజన అనంతరం హైద్రాబాద్ నగరం పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు న్యాయపరమైన, పాలనాపరమైన ఏర్పాట్లను సూచించడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, పంపిణీ, ఆదాయ వనరులు, సిబ్బంది పంపిణీ వంటి అంశాలపై విధివిధానాలను సూచిస్తూ జీవోఎం ఆరు వారాలలో కేంద్ర మంత్రివర్గానికి నివేదిక సమర్పించాల్సి ఉంది.
ఇన్:
1. ఆజాద్
2. మొయిలీ
3. జైరాం రమేశ్
4. ఆంటోనీ
ఔట్:
1. కపిల్ సిబల్
2. హరీశ్ రావత్
3. కమల్‌నాథ్
4. ఆస్కార్ ఫెర్నాండెజ్
5. జ్యోతిరాదిత్య సింధియా
6. మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
7. పల్లంరాజు
మంత్రుల బృందంలో మార్పులు
Published Wed, Oct 9 2013 1:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement