'సీఎంకు తెలిసినంతగా రాజ్యాంగం నాకు తెలీదు'
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఈనెల 30న మరోసారి సమావేశం అవుతుందని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. ఈ భేటీలో తెలంగాణపై బిల్లుపై చర్చించనున్నట్లు ఆయన సోమవారమిక్కడ పేర్కొన్నారు. ఈ విషయంపై తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడినట్లు తెలిపారు.
రాజ్యాంగంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న పట్టు తనకు లేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర కేబినెట్ రూపొందించిన తెలంగాణ ముసాయిదా బిల్లును న్యాయశాఖ ఆమోదించాకే రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపటం జరిగిందన్నారు.
తెలంగాణ బిల్లుపై పార్లమెంట్లో చర్చకు పెడతామని, సభలో ఆమోదం పొందుతుందో లేదో చూద్దామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలతో బిల్లులో సవరణలపై అప్పటికే చర్చించామని జైరాం తెలిపారు. అసెంబ్లీ నుంచి వచ్చే సవరణలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని... బిల్లులో ఎన్ని సవరణలు ఆమోదం పొందుతాయో చెప్పలేమని అన్నారు.