ఇక స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై రాయొచ్చు
న్యూయార్క్: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై రాయగలిగే కొత్త టెక్నాలజీని గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ సంస్థ కొత్తగా రూపొందించిన ‘హ్యండ్ రైటింగ్ ఇనుపుట్’ యాప్‌తో మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ స్క్రీన్‌పై రాసి మీ కలానికున్న పదునేంటో చూపించొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 82భాషలను అనుమతించే ఈ యాప్ మీరు స్క్రీన్‌పై రాయగానే ఆ టెక్ట్స్‌ని స్టాండర్డ్ డిజిటల్ టెక్ట్స్‌గా మారుస్తుంది. దీని ద్వారా చేతి వేళ్లతో కూడా రాసే అవకాశం ఉంది. అక్షరాలతోపాటు ఏదైనా డిజిటల్ ఐకాన్‌ను కూడా టెక్ట్స్‌కు జత చేయవచ్చు. స్క్రీన్‌పై రాసే అవకాశం ఉన్న యాప్‌లలో ఇది కొత్తదేం కాదు.
ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో విండోస్ జర్నల్ అనే యాప్ కూడా హ్యాండ్‌రైటింగ్‌కు ఉద్దేశించిందే. అయితే గూగుల్ వెర్షన్‌లో క్లౌడ్ సాంకేతికతను కూడా కలిగి ఉండడం విశేషం. వినియోగదారులు స్క్రీన్‌పై రాయగానే అది డిజిటల్ టెక్ట్స్ రూపంలోకి మారడమే కాకుండా, క్లౌడ్ ఫీచర్ ద్వారా వెబ్‌లోకి అప్‌లోడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 4.0.3, ఆపై వెర్షన్లలో మాత్రమే పనిచేసే ఈ యాప్ గూగుల్ ప్లేలో అందుబాటులో ఉంది.