క్షణక్షణం ట్విస్టులు.. పోయెస్ గార్డెన్‌కు శశి!
చెన్నై: తమిళనాట ఏర్పడిన రాజకీయ సునామీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పదవి కోసం వీకే శశికళ, పన్నీర్ సెల్వం మధ్య హోరాహోరీ ఎత్తులు-పైఎత్తులతో క్షణక్షణం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎడతెరిపిలెకుండా సాగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తీరు కూడా ఆసక్తిరేపుతోంది. ఆయనను కలిసేందుకు అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ ఒంటరిగానే రాజ్‌భవన్‌కు బయలుదేరారని కథనాలు వచ్చాయి. అయితే, గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను కలిసిన అనంతరం ఆమె నేరుగా పోయెస్‌గార్డెన్‌కు వెళ్లిపోయారని అన్నాడీఎంకే వర్గాలు ధ్రువీకరించాయి. రోజంతా ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తూ వాడీవేడిగా సాగిన రాజకీయా పరిణామాలలో ఈ రోజు పన్నీర్ సెల్వం కాస్తా పైచేయి సాధించినట్టు కనబడింది. ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరడం.. ఆ వర్గానికి కాస్తంత ఊరటనిచ్చే అంశం. అయితే, ఇప్పటికీ కూడా ఎక్కువమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శశికళ వెంట ఉన్నట్టే తెలుస్తోంది.
గోల్డెన్ బే రిసార్ట్‌లో క్యాంపుగా ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కలిసిన అనంతరం గవర్నర్‌ను కలువాలని శశికళ భావించినట్టు తెలిసింది. ఇందుకోసం గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్టు సమాచారం. అయితే, గవర్నర్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని తెలుస్తోంది. ఎక్కవకాలం జాప్యం చేయకుండా అమీ-తుమీ తేల్చుకోవాలని శశికళ వర్గం భావిస్తున్నప్పటికీ, గవర్నర్‌తో ఘర్షణ పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహారం నడుపాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.
రాజ్‌భవన్ ముందు పరేడ్ తన వర్గం ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించాలనేది శశికళ వర్గం వ్యూహంగా ఉన్నప్పటికీ అది వాయిదా పడినట్టు సమాచారం. మరోవైపు నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్‌భవన్ ముందు భారీస్థాయిలో పోలీసులను మోహరించారు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావుతో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆయన చర్చించారు. ఒకప్పుడు శశికళను వ్యతిరేకించిన సుబ్రహ్మణ్యస్వామే.. ఇప్పుడు ఆమెతో గవర్నర్ ప్రమాణం చేయించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఓపీఎస్ దూకుడు!
మరోవైపు పన్నీర్ సెల్వం దూకుడుగా ముందుకెళుతూ.. శశికళ వర్గాన్ని వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఊహించనిరీతిలో ఆయనకు మద్దతు వెల్లువెత్తోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు సహా ముగ్గురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరారు. అదేవిధంగా శశికళకు నమ్మకస్తుడైన నేతగా భావిస్తున్న దిండిగల్ శ్రీనివాస్ కూడా సెల్వం జైకొట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా అన్నాడీఎంకేకు మీడియా గొంతుగా ఉన్న ఆ పార్టీ అధికారి ప్రతినిధి సీ పొన్నియన్ కూడా చిన్నమ్మకు ఝలక్ ఇచ్చారు. ఆయన తాజాగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను విచ్ఛిన్నం కాకుండా కాపాడే శక్తి పన్నీర్ సెల్వానికి ఉందని ప్రకటించారు. పొన్నియన్ రాకతో సెల్వం వర్గం మరింత పుంజుకుంది. ఎట్టిపరిస్థితుల్లో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నది.