శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్!
రోజురోజుకు చిన్నమ్మ బలం తగ్గిపోతోంది. శశికళ వర్గంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా జారుకుంటున్నారు. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం గూటికి చేరుతున్నారు. తాజాగా మరో ఐదుగురు అన్నాడీఎంకే మంత్రులు శశికళ శిబిరం నుంచి జంప్ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు మంత్రులు (విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్, మత్య్సశాఖ మంత్రి జయకుమార్) ఓపీఎస్‌కు జై కొట్టగా.. మరో ఐదుగురు కూడా సెల్వం వైపు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
శశితో సమావేశం ముగియగానే జంప్!
గోల్డెన్ బే రిసార్ట్‌లో క్యాంపుగా ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ శనివారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం ముగియగానే ఐదుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యే జారుకున్నట్టు తెలియడం చిన్నమ్మ వర్గానికి షాక్ ఇచ్చింది. శశితో భేటీ ముగిసిన వెంటనే శిబిరం నుంచి ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే జారుకున్నట్టు తేలింది. అలాగే, శిబిరం వద్ద ఉండాల్సిన మరో ముగ్గురు మంత్రుల జాడ కానరాలేదు. ఇందులో అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్, పాడి, డెయిరీ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ, విద్యుత్‌శాఖ మంత్రి తంగమణి, పురపాలక శాఖ మంత్రి ఎపీ వేలుమణి, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి బెంజిమిన్, మాజీ మంత్రి, కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. వీరంతా ఆదివారం పన్నీరు శిబిరంలో ప్రత్యక్షమవుతారేమో అన్న ఆందోళన శశికళ వర్గంలో నెలకొంది. పన్నీర్‌సెల్వం దూకుడు పెంచడంతో శశికళ తన శిబిరంలోని సుమారు 30 మంది ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
సెల్వం శిబిరంలోకి చేరికలు!
శనివారం నలుగురు టీఆర్ సుందరం, అశోక్‌కుమార్, సత్యభామ, వనరోజా.. పన్నీర్ సెల్వం గూటికి చేశారు. అదేవిధంగా శశికళకు నమ్మకస్తుడైన నేతగా భావిస్తున్న దిండిగల్ శ్రీనివాస్ కూడా సెల్వం జైకొట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. తనపై తిరుగుబాటు చేయడంతో పన్నీర్ సెల్వాన్ని శశికళ పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ పదవిని దిండిగల్ శ్రీనివాసన్‌కు అప్పగించారు. ఇప్పుడు ఆయనే పన్నీర్ సెల్వం గూటికి చేరుతుండటం తమిళనాట మారుతున్న రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది. అంతేకాకుండా అన్నాడీఎంకేకు మీడియా గొంతుగా ఉన్న ఆ పార్టీ అధికారి ప్రతినిధి సీ పొన్నియన్ కూడా చిన్నమ్మకు ఝలక్ ఇచ్చారు. ఆయన తాజాగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.