నేడు శశికళ భారీ స్కెచ్?
చెన్నై: ఒకవైపు పన్నీర్ సెల్వానికి పెరుగుతున్న మద్దతు.. మరోవైపు జారుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఈక్రమంలో అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు కేంద్రంపై ఆచితూచి మాట్లాడిన చిన్నమ్మ.. తాజాగా స్వరం పెంచిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేను చీల్చేందుకే.. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారాన్ని గవర్నర్ వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర్‌రావుకు హెచ్చరికతో కూడిన లేఖను పంపిన శశికళ.. ఆదివారం భారీ వ్యూహానికి తెరలేపనున్నారని తెలుస్తోంది.
శశికళ ఆదివారం మరోసారి గవర్నర్ విద్యాసాగర్‌రావు అపాయింట్‌మెంట్‌ను కోరారు. శనివారం ఆమె అపాయింట్‌మెంట్ కోరినా.. గవర్నర్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదన్న సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని శశికళ భావిస్తున్నారు. రిసార్ట్‌లో బస చేసిన తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకొని.. నేరుగా ఢిల్లీకి వెళ్లాలని ఆమె భావిస్తున్నారు. గవర్నర్ కావాలనే తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనే విషయాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలన్నది శశికళ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో శశికళకు అపాయింట్‌మెంట్, గవర్నర్ తదుపరి చర్య ఏమిటన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. మరికాసేపట్లో రాజ్‌భవన్ నుంచి కీలక ప్రకటన వెలువడవచ్చునన్న లీకులు వస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెన్నైలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అసాంఘిక శక్తలు దాడులు, విధ్వంసాలకు దిగకుండా అడుగడుగునా పోలీసులను మోహరించారు. కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగొచ్చునని తెలుస్తోంది.