రిలీజ్కు ముందే ఆన్లైన్లో సినిమా లీక్!
న్యూఢిల్లీ: రితేశ్ దేశ్ముఖ్, వివేక్ ఒబరాయ్, ఆఫ్తాబ్ శివదాసని, ఊర్వశీ రౌతేలా, పూజా బోస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆడల్ట్ కామెడీ మూవీ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'... 'మస్తీ', 'గ్రేట్ మస్తీ' సిరీస్ భాగంగా వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఆన్ లైన్ లో లీకైంది. ఈ లీకు ఆన్ లైన్ లో దుమారం రేపడంతో అప్రమత్తమైన 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' చిత్రయూనిట్ ఈ సినిమా విడుదలను ఒక వారం ముందుకు జరిపింది. నిజానికి ఈ సినిమా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఈ శుక్రవారమే (ఎల్లుండి) విడుదల చేయబోతున్నారు.
సినిమా ఆన్ లైన్ లో లీకు కావడంపై స్పందించడానికి 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' స్టార్లు రితేశ్, వివేక్, ఆఫ్తాబ్ నిరాకరించారు. ఈ విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వలేదు. ఢిల్లీలో బుధవారం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు ఈ విషయంపై తాము కామెంట్ చేయబోమని చెప్పారు. సినిమా లీక్ పై నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనుందని వివేక్ తెలిపారు. 'మస్తీ' సిరీస్ లో భాగంగా వస్తున్న మూడో సినిమాలోనూ తాము కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉందని, గత 12 ఏళ్లుగా ఈ సినిమాల కోసం పనిచేయడం వల్ల తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని ముగ్గురు స్టార్లు పేర్కొన్నారు.