
పోటెత్తిన భక్త జనం
రాజమహేంద్రికి ఆధ్యాత్మిక శోభ
తొలిరోజు కిక్కిరిసిన ఘాట్‌లు
రాజమండ్రి: ఎటుచూసినా భక్తజన సందోహమే.. రహదారులన్నీ జన గోదారులను తలపించాయి. గోదారమ్మను చూడాలి.. పుష్కర స్నానమాచరించి పాపవిమోచనం పొందాలని కోరుకుంటూ లక్షలాదిగా భక్తులు మంగళవారం రాజమహేంద్రికి పోటెత్తారు. గోదావరి పుష్కరాలు ఆరంభం కావడంతో ఈ చారిత్రక నగరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. సోమవారం అర్ధరాత్రి నుంచే తరలివచ్చిన జనవాహినితో రాజమహేంద్రి పులకించిపోయింది. ఒకవైపు లక్షలాదిగా భక్తజనం, మరోవైపు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వీఐపీలు.. తొలి రోజు పుష్కర స్నానమాచరించారు. వాస్తవానికి పుష్కర ఘడియలు ప్రారంభం కాకముందే వేకువజామున మూడు గంటల నుంచే పుష్కర స్నానాలు మొదలయ్యాయి. ఇక పుష్కర ఘడియలు ఆరంభమైనప్పటి నుంచి మంగళవారం రాత్రి వరకూ రాజమండ్రిలో లక్షలాదిగా భక్తజనం పుష్కర స్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు.
జయేంద్ర సర స్వతి పూజలు
పుష్కరాలను అధికారికంగా ప్రారంభించేందుకు కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. శాస్త్రోక్తంగా పుష్కర క్రతువులన్నీ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సరిగ్గా 6.26 గంటలకు శిష్యబృందంతో ఘాట్‌లో అడుగుపెట్టిన స్వామీజీ తొలుత మట్టి తీసి నదిలో వేసి ఆ తర్వాత పుష్కర స్నానమాచరించారు. తొలుత తూర్పు దిశగా తిరిగి.. తర్వాత ఉత్తరం వైపు తిరిగి పుష్కర స్నానం చేశారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమైనట్టు ప్రకటించారు.
పితృదేవతలకు చంద్రబాబు పిండప్రదానం
జయేంద్ర సరస్వతితోపాటు ఘాట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర ఘడియల్లోనే కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఎన్టీఆర్ మరో కుమార్తె గారపాటి లోకేశ్వరి, ఆమె తనయుడు శ్రీనివాస్, చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి భార్య ఇందిర, చంద్రబాబు సోదరి హైమావతితోపాటు మరో 10 మంది బంధువులు పుష్కర స్నానం చేశారు. అనంతరం తల్లిదండ్రులు, అత్తమామలతోపాటు ఇతర పితృదేవతలకు చంద్రబాబు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. అనంతరం గోదానం చేశారు. ఈ కార్యక్రమం పుష్కర ఘాట్‌లో రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆవిష్కరించిన శ్రీకృష్ణుని అవతారంలోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక జరిగింది. వీఐపీ ఘాట్ అయిన సరస్వతి ఘాట్‌కు ప్రముఖుల తాకిడి తెల్లవారుజాము నుంచే మొదలైంది. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్‌రావ్ భగవత్ మధ్యాహ్నం 2 గంటలకు స్నానమాచరించారు. చంద్రబాబు ఆయనను దుశ్శాలువతో సత్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు శివశంకర్, సుబ్బారావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితరులు పుష్కర స్నానమాచరించారు.
స్తంభించిన రాజమహేంద్రి
నాయకుల హడావుడి, పోలీసుల నిర్లక్ష్యం ఫలితంగా పుష్కర రాజధాని రాజమండ్రిలో మంగళవారం జనజీవనం స్తంభించింది. పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరగడంతో పోలీసులు ఆంక్షలను కఠినతరం చేశారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై మధ్యాహ్నం నుంచి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. భక్తులు, రాజమండ్రివాసులు నరకం అనుభవించారు. 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి, కొవ్వూరు, కాకినాడ, రామచంద్రపురంవైపు నుంచి వచ్చే భక్తుల బస్సులు, ప్రైవేట్ వాహనాలను శివార్లలోనే ఆపేయాలని పోలీసులు ప్రణాళిక రూపొందించారు. అయితే చాలామంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ తమ వాహనాల్లో రాజమండ్రికి వచ్చేస్తున్నారు. మంత్రుల కాన్వాయ్‌లు, టీడీపీ నేతల కార్లు, అధికారుల వాహనాలతో రాజమండ్రి కిక్కిరిసిపోయింది. పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట తర్వాత పోలీసులు ఒక్కసారిగా ఆంక్షలను కఠినతరం చేశారు. 16వ నంబరు జాతీయ రహదారిపై నుంచి రాజమండ్రిలోకి వాహనాలు రాకుండా నిలిపేశారు. దీంతో లాలాచెరువు నుంచి మోరంపూడి సెంటర్ వరకూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విజయవాడ-విశాఖ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.