మెడిసిన్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ రిమ్స్: డాక్టర్ వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఆత్మహత్యాయత్నం చేసిందో వైద్యవిద్యార్థిని. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాలలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంచిర్యాల మండలం తర్లపాడుకు చెందిన యువతి రిమ్స్ లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. రిమ్స్ ఆసుపత్రిలోనే జనరల్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆసుపత్రి ఓపీ భవనంపైకి ఎక్కిన విద్యార్థిని.. కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. వైద్యుడు తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని, ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోవడంలేదని అందుకే చనిపోవాలనుకుంటున్నట్లు బాధిత విద్యార్థిని వెల్లడించింది.
తండ్రి మాటలతో గందరగోళం
సిబ్బంది ఇచ్చిన సమాచారంతో రిమ్స్ కు చేరుకున్న పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడగా.. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆమె తండ్రి పోలీసులకు చెప్పాడు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. అనంతరం బాధితురాలికి చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తామని, వేధింపుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని టూ టౌన్ ఎస్సై విష్ణు వెల్లడించారు. కాగా, వైద్యుడితో పాటు కొంత మంది విద్యార్థులు కూడా ఆమెను వేధించినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడిన తర్వాతగానీ నిజానిజాలు వెలుగులోకి రావని పోలీసులు భావిస్తున్నారు.