రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపేయాలని హెచ్చరించారంటున్న పటేల్ నేత
అహ్మదాబాద్: గుజరాత్ పటేల్ సామాజిక వర్గ నేత హార్దిక్ పటేల్ అదృశ్యం అంశం హైడ్రామా నడుమ సుఖాంతమైంది. సురేంద్రనగర్ జిల్లా, ధ్రంగద్ర పట్టణ సమీపంలోని హైవేపై బుధవారం ఉదయం ఆయన ప్రత్యక్షమయ్యారు. కొందరు సాయుధులు తనను కార్లో అపహరించారని ఆయన చెబుతున్నారు. పటేళ్లను ఓబీసీలో చేర్చాలని ఉద్యమిస్తున్న హార్దిక్ మంగళవారం బయాద్ తాలూకాలో అనుమతి లేకుండా సభను నిర్వహిస్తుండటంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
కానీ అనుచరుల సాయంతో ఆయన తప్పించుకున్నారు. అనంతరం, మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత హార్దిక్ అనుచరుడు దినేశ్ పటేల్ హార్దిక్‌ను పోలీసులు నిర్బంధించారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కేజే ఠాకూర్‌ల ధర్మాసనం రాత్రి 2.40 గంటల దాకా దీనిపై విచారణ జరిపింది.
హార్దిక్‌ను అరెస్ట్ చేయలేదని పోలీసులు ధర్మాసనానికి చెప్పడంతో, ఆయన ఎక్కడున్నాడో గుర్తించి, హాజరుపర్చాలని కోర్టు ఆదేశించిం ది. బుధవారం మధ్యాహ్నం తాను ధ్రంగద్ర హైవేపై ఉన్నానని హార్దిక్ తన అనుచరులకు సమాచారమిచ్చారు. బయాద్ పట్టణంలో కొందరు తనను అపహరించి, రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపేయకుంటే చంపేస్తామని బెదిరిం చి, ఉదయం హైవేపై వదిలేసారని చెప్పారు.
హార్దిక్ అదృశ్యం.. హైడ్రామా!
Published Thu, Sep 24 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM
Advertisement
Advertisement