హార్దిక్ పటేల్ అరెస్టు.. పోలీసుల హైడ్రామా!
అహ్మదాబాద్: ఓబీసీ రిజర్వేషన్లలో పటేళ్లను చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్న గుజరాత్ యువకుడు హార్దిక్ పటేల్ అరెస్టు విషయంలో ఓ హైడ్రామా చోటుచేసుకుంది. ఓ గ్రామంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాడని పోలీసులు ఆయనను, అతడి అనుచరులను అరెస్టు చేశారని హార్దిక్ పటేల్ తరుపు న్యాయవాది ఆరోపించగా పోలీసులు మాత్రం తాము ఏ అరెస్టు చేయలేదని, అరెస్టు చేసేందుకు వెళ్లగానే ఆయన అక్కడి నుంచి ఓ వాహనంలో తన అనుచరులతో కలిసి పారిపోయాడని, తాను ఎక్కడ ఉన్నాడన్న సమాచారం కూడా లేదని అన్నారు.
అయితే, న్యాయవాది రాత్రి సమయంలో కోర్టును సంప్రదించగా అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభం అయ్యే సమయానికి పోలీసులు హార్దిక్ను కోర్టు ముందు ప్రవేశ పెట్టాలని చెప్పారు. అయితే, ఇలా కోర్టు ఆదేశించిన కొన్ని గంటల్లోనే హార్దిక్ పటేల్ కనిపించడం గమనార్హం.
పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న హార్దిక్ పటేల్... ఆ క్రమంలో అరవల్లి జిల్లా తెన్పూర్ గ్రామంలో సభ నిర్వహించారు. ఐతే సభకు ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ.. పోలీసులు అక్కడే హార్దిక్ పటేల్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే, ఆయన తమ ఇంకా దొరకలేదన్నట్లుగా గాంధీనగర్, సబర్‌కంతా, అరవల్లి జిల్లాల్లో పోలీసువర్గాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్యమం ఆపేయాల్సింగా ఆయనను పోలీసులు బెదిరించినట్లు సమాచారం. ఈలోగా హార్దిక్ బయట కనిపించారు. అయితే, ఇప్పటి వరకు ఆయనను అరెస్టు చేసినట్లు అధికారికంగా పోలీసులు ప్రకటించకపోయినా.. అంతకుముందే అదుపులోకి తీసుకొని వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.