
సోషల్ మీడియాలో నయా హీరో..
గుజరాత్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న హార్దిక్ పటేల్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నాడు.
గుజరాత్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న హార్దిక్ పటేల్ ప్రస్తుతం పటేల్ సామాజిక వర్గానికే కాక యువత దృష్టిలో హీరోగా ముద్ర వేసుకున్నాడు. 22 ఏళ్ల హార్దిక్ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నాడు. ట్విటర్ లో పటేల్ అభిమానులు కో కొల్లలు... అలాగే విమర్శకులూ వేలకు వేలు.
పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరిట పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్న హార్దిక్ పటేల్ పై ట్విటర్ పై కామెంట్లు పోటెత్తున్నాయి. ఆ సామాజిక వర్గానికే హీరోగా మారిన హార్దిక్ పటేల్ కు ట్వీట్లతోనూ పలు రకాల ప్రోత్సాహం లభిస్తోంది.
గుజరాత్ ప్రభుత్వాన్నే గడగడలాడిస్తున్న హార్దిక్ ఆందోళనకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే స్పందించారు. గుజరాత్ లో ఆందోళనకారులు సంయమనం పాటించాలని ప్రధాని ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే హార్ధిక్ పోరాటాన్ని ప్రభుత్వం అంత ఆషామాషీగా తీసుకోలేదనిపిస్తోంది.
ఓ పక్క హార్దిక్ ను అభినందిస్తూ ట్వీట్ చేసిన పలు కార్టూన్లు ట్విటర్ లో హల్ చల్ చేస్తుంటే... మరోపక్క కొందరు విమర్శకులు హార్దిక్ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ పటేల్ భారతీయుల ఆకాంక్షలు తెలిసిన వ్యక్తి అని, ఆయన మోదీ కంటే ప్రతిష్టాత్మకంగా వ్యవరించగలరని లిబరల్ ఆఫ్ న్యూ ఢిల్లీ పేరిట ఓ ట్వీట్ పోస్ట్ అవడం హార్దిక్ పై అభిమానం వెల్లడౌతుంది.
అయితే హార్దిక్ పద్ధతి చూస్తుంటే గుజరాత్ పోషకాహార లోపం నివేదికలు తప్పనిపిస్తోందని, ఇటువంటి ఆందోళనలు ఆరోగ్యంగా ఉన్నవారెవరైనా చేస్తారా అంటూ విమర్శలు గుప్పించారు వన్ టిప్ వన్ హ్యాండ్ పేరిట పోస్ట్ అయిన ట్వీట్ లో. అంటే హార్దిక్ కు గుజరాత్ లో ఎంతమంది అభిమానులున్నారో అదే స్థాయిలో విమర్శకులూ ఉన్నారన్న విషయం రూఢి అవుతోంది.