
ఆమ్లా-బ్రేవో సరికొత్త రికార్డు
ట్రినిడాడ్: స్టార్ ఆటగాడు హషీమ్ ఆమ్లా, ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవోలు సరికొత్త రికార్డు నమోదు చేశారు. ప్రస్తుతం కరీబియన్ లీగ్లో ట్రినిబాగో నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నఈ ఇద్దరు ఆటగాళ్లు రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ట్రినిబోగా నైట్ రైడర్స్ 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో ఆమ్లా-బ్రేవోల జోడి 150 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. తద్వారా టీ 20 చరిత్రలో ఐదో వికెట్ కు అత్యధిక భాగస్వామ్య రికార్డును ఈ జోడి తమ పేరిట లిఖించుకుంది.
ఈ మ్యాచ్లో ఆమ్లా(81;54 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), బ్రేవో (66 నాటౌట్; 46 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బార్బోడాస్ ట్రిడెంట్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 159 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దీంతో నైట్ రైడర్స్ కు 11 పరుగుల విజయం దక్కింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సహయజమానిగా ఉన్న ట్రినిబాగో నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.