టాటా- మిస్త్రీ మధ్య చర్చలు?
ముంబై: టాటా- మిస్త్రీ వివాదంలో ఆసక్తికర పరిణామాలుచోటు చేసుకుంటున్నాయి. గత వారంరోజులుగా సంచలనంగా మారిన టాటా- మిస్త్రీ వివాదానికి తెరపడనుందా? రచ్చకెక్కిన టాటా బోర్డు రూం డ్రామా కు చర్చల ద్వారా ముగింపు పలకాలని రతన్ టాటా చూస్తున్నారా? జాతీయ మీడియా అంచనాల ప్రకారం ఈ మేరకు రతన్ టాటా, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మధ్య మధ్యవర్తిత్వ చర్చలకు రంగం సిద్ధమైంది. సీనియర్ న్యాయవాది, టాటా సంస్థ ట్రస్టీ అయిన దారియస్ కాంబట ఈ చర్చలకు నేతృత్వం వహిస్తున్నట్టు సీఎన్ బీసీ టీవీ -18 పేర్కొంది. ఈ మేరకు ఆయన ఇద్దర్నీ కలిసి చర్చించనున్నారని సన్నిహిత వర్గాల సమాచారమని నివేదించింది.
ఒకవైపు టాటాలోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్, టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి 18 శాతం ఆసక్తిగల కొనుగోలు దారులకోసం వెదుకుతోందని వార్తలు వచ్చాయి మరోవైపు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చెందిన ముగ్గురు సభ్యులు తాజాగా సంస్థకు గుడ్‌బై చెప్పారు. టాటా సన్స్ అడ్వైజరీ కౌన్సిల్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మధు కన్నన్, వ్యూహకర్త నిర్మాల్య కుమార్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ ఎన్‌ఎస్ రాజన్ ఉన్నారు.
కాగా మహారాష్ట్ర మాజీ అటార్నీ జనరల్ దరియాస్ కాంబట టాటా గ్రూపునకు అత్యంత సన్నిహితులు. మరోవైపు ఈ వార్తలపై అటు టాటా సంస్థలనుంచి గానీ, మిస్త్రీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.