అమ్మో ఆయన టీఆర్‌ఎస్ కోవర్ట్!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరోసారి గ్రూపు రాజకీయాలు పట్టి పీడిస్తున్నాయని ఆ పార్టీ నాయకులే ఇదై పోతున్నారు. అదీగాకుండా కోవర్టుల వల్ల కూడా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా పార్టీ పరిస్థితి తయారైందని సీనియర్ నేతలు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. గాంధీ కుటుంబానికి, పార్టీ హైకమాండ్‌కు వీరవిధేయుడినని చెప్పుకునే నేత తీరును వారు ఉదహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌పై కాకుండా టీడీపీ, బీజేపీలను టార్గెట్ చేస్తూ సదరు నేత విమర్శల పరంపరను కొనసాగించడం కూడా ఈ నేతలకు నచ్చడంలేదు. తాజాగా లలిత్ మోదీ వ్యవహారంతో సుష్మా, వసుంధరరాజే రాజీనామాలు, వ్యాపంలో ఎంపీ సీఎం చౌహాన్ రాజీనామాల కోసం డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుదామని సదరునేత ప్రతిపాదించారట.
దీనిని పార్టీ ముఖ్యనేతలు పెద్దగా పట్టించుకోలేదు. దీనితో ఆయన ఎల్‌బీనగర్ చౌరస్తాలో శుక్రవారం ఒక నిరసన ధర్నాను నిర్వహించడంతో పాటు ఏఐసీసీలో ఉన్న పలుకుబడితో ఒకనేతను కూడా దానిలో పాల్గొనేలా చేయగలిగారు. అధిష్టానం వద్ద ఏం మాట వస్తుందోనని ఇతర రాష్ట్ర స్థాయి నేతలు కూడా పాల్గొనక తప్పలేదు. అయితే, పాల్గొనకపోతే హైకమాండ్‌కు ఫిర్యాదులు పోతాయని, నిరసనకు పెద్ద ఎత్తున కవరేజీ వస్తే ఆ నేతకే క్రెడిట్ దక్కుతుందని మీడియాకు సమాచారం ఇవ్వలేదని వీరవిధేయుడి అనుచరులు వాపోతున్నారు.