ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు!
న్యూఢిల్లీ: భారీ వర్షాలు ఉత్తరాదిని ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లోని మురాదాబాద్ ఢిల్లీ మార్గంలో పలు చోట్ల వాగులు పొంగి రోడ్లే నదులను తలపిస్తున్నాయి. చెరువులను గండ్లు పడి పంటలు ఇళ్లు నీటమునిగాయి. చాంద్పూర్కు చెందిన యుకెజి విద్యార్ధి రెహాన్ నీట మునిగి మృతి చెందాడు. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అక్కడి వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ వాపి ప్రాంతంలో నదులు పొంగి పొర్లుతున్నాయి. రవాణా కష్టం అవుతోంది. ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గతేడాదిలాగే ఇప్పుడు కూడా వరదలు వణికిస్తున్నాయి. ఈ యాత్ర కోసం వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు బద్రినాథ్‌లో చిక్కుకుపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వీళ్లలో చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు.
ఒడిశా నుంచి కోస్తా, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో ఉత్తరకోస్తాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది