న్యూఢిల్లీ: దేశీ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో రూ.481 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.441 కోట్ల లాభంతో పోలిస్తే 9.26 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.5,151 కోట్ల నుంచి రూ.5,696 కోట్లకు ఎగబాకింది. 10.58 శాతం పెరుగుదల నమోదైంది. వాహన అమ్మకాల్లో స్థిరమైన వృద్ధే మెరుగైన ఫలితాలకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది.
6 శాతం పెరిగిన విక్రయాలు...
జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ 14,16,276 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 13,32,805 టూవీలర్లతో పోలిస్తే 6.26% వృద్ధి నమోదైంది. ‘ప్రస్తుతం పండుగ సీజన్‌లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. సెంటిమెంట్ మెరుగ్గానే ఉంది. మార్కెట్లో కొనుగోళ్లు సానుకూలంగానే ఉన్నా యి. క్యూ2లో పనితీరును పరిశీలిస్తే... తాము పటిష్టమైన మార్జిన్లను సాధించగలమనే విషయాన్ని చాటిచెప్పాం’ అని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ పేర్కొన్నారు. అయితే, వాహన పరిశ్రమకు సవాళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణత ప్రభావంతో వాహన రంగంతోపాటు పలు రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన వివరించారు. ఉక్కు, నికెల్, కాపర్, రబ్బర్ వంటి కమోడిటీల ధరలకు రెక్కలొస్తున్నాయని, ఉత్పాదక వ్యయం తడిసిమోపెడవుతోందని చెప్పారు. కాగా, బుధవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 0.86 శాతం పెరిగి రూ.2,088 వద్ద స్థిరపడింది.
‘హీరో’ లాభం 9% వృద్ధి
Published Thu, Oct 24 2013 12:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement