ట్రంప్‌ను అడ్డుకోకుంటే మనం మటాషే! | Hollande calls on EU leaders to refuse "pressure" from US | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ను అడ్డుకోకుంటే మనం మటాషే!

Published Sat, Feb 4 2017 12:10 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్‌ను అడ్డుకోకుంటే మనం మటాషే! - Sakshi

ట్రంప్‌ను అడ్డుకోకుంటే మనం మటాషే!

- అమెరికా, రష్యాల దోస్తీ ప్రమాదకరం
- కలిసికట్టుగాఎదుర్కొందాం: ఈయూకు ఫ్రాన్స్‌ పిలుపు

వలెటా: అగ్రరాజ్యానికి ఆప్తమిత్రులుగా కొనసాగుతున్న దేశాలు డొనాల్ట్‌ ట్రంప్‌ తీరుతో విసిగిపోయాయా? అమెరికాను, దాని కొత్త మిత్రుడు రష్యాను ధీటుగా ఎదుర్కొనేందుకు పూనుకుంటున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసేలా.. మాల్టా రాజధాని వలెటాలో శుక్రవారం జరిగిన యురోపియన్‌ యూనియన్‌(ఈయూ) అనధికార సదస్సులో పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. రష్యాతో అమెరికా జతకట్టడం ప్రమాదఘంటిక లాంటిదని ఈయూ నేతలు అభిప్రాయపడ్డారు.
 
ఈయూ సదస్సులో కీలక ప్రసంగం చేసిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే మరో అడుగు ముందుకేసి.. ట్రంప్‌ ప్రయోగిస్తోన్న ‘ఒత్తిడి’ని బలంగా అడ్డుకోకుంటే యూరప్‌ మనుగడలో లేకుండాపోయే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. ట్రంప్‌ను ఎదుర్కొనే దిశగా ఈయూలోని 28 దేశాలూ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. యూరప్‌ దేశాలు.. అమెరికా, రష్యాలపై ఆధారపడటం మానుకొని, సొంతగా రక్షణ, వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరారు. ఇవేవీ జరగని పక్షంలో యూరప్‌ విఛ్చితి ఖాయమని అభిప్రాయపడ్డారు. 
 
‘నాటో నుంచి బయటికొస్తామని, రష్యాతో దోస్తీ చేస్తామని ట్రంప్‌ పదేపదే చెబుతున్నారు. మధ్యధరా నుంచి వచ్చే శరణార్థుల విషయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ యురప్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో.. అమెరికా, రష్యాలు కలిసి యూరప్‌ దేశాలను విచ్ఛిన్నం చేస్తాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే ఈ ఊహాగానాల్లో వాస్తవం లేకపోలేదు. మనం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యేరోజులు ఎంతో దూరంలోలేవు. అందుకే మనం కలిసికట్టుగా ఉందాం. ఒత్తడిని తరిమేద్దాం. నాటో లాంటివే సంయుక్త రక్షణ దళాలను ఏర్పాటుచేసుకుందాం. వాణిజ్య, వ్యాపార సంబంధాలను మెరుగుపర్చుకుందాం’ అని హోలాండే అన్నారు. 
 
కాగా, ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విషయంలో అమెరికా కోర్టుల భిన్న తీర్పులు ఇచ్చిన దరిమిలా ఈయూలోని కొన్ని దేశాలు ట్రంప్‌ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కలిగిఉన్నాయని హొలాండే చెప్పుకొచ్చారు. ట్రిటీస్‌ ఆఫ్‌ రోమ్‌(రోమ్‌ కూటమి)60వ వార్షికోత్సవాలపైనా ఈ సదస్సులో తీర్మానాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement