రోజుకు వందమంది భార్యా బాధితులు!
ఇండియాలో రేప్ కేసులకు ప్రధాన కేంద్రంగా మారిపోయిన ఢిల్లీలో ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగు చూసింది. మహిళల వేధింపులకు గురవుతున్న పురుషుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని ఈ కొత్త లెక్కలు చెప్తున్నాయి. బాధల్లో ఉన్న పురుషుల సమస్యలను తెలుసుకునేందుకు సుమారు సంవత్సరం క్రితం ఏర్పాటు చేసిన ఓ హెల్ప్ లైన్ నెంబర్ కు ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 40 ఎన్జీవో సంస్థల ద్వారా సుమారు 37 వేల ఫిర్యాదులు అందినట్లు ఆ సంస్థ చెబుతోంది.
ఫిర్యాదుల్లో కొన్ని బోగస్ అయినా... రోజుకు సుమారుగా వంద కాల్స్ వస్తున్నాయని హెల్ప్ లైన్ లెక్కల్లో తేలింది. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరున ఓ సంస్థ నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో చాలామంది బాధితులు తమకు చట్టబద్ధమైన పరిష్కారాలు దొరకడం లేదని చెప్పడం విశేషం. లైంగిక వేధింపులకు గురైన మగవారికి ఇండియన్ యాంటీ రేప్ చట్టం ఎటువంటి పరిష్కారం సూచించడం లేదని కౌన్సిలర్లు చెప్తున్నారు.
రోజుకు దేశవ్యాప్తంగా ఫాల్స్ రేప్, ఫాల్స్ డౌరీ కేసుల్లో తమకు వస్తున్న సుమారు 110 కాల్స్ లో 65 నుంచి 70 శాతం బాధితులు కొత్తవారే అయి ఉంటున్నారని ఎస్.ఐ.ఎఫ్ కౌన్సిలర్ రిత్విక్ బిసారియా చెప్తున్నారు. తమకు వచ్చే డేటాను పరిశీలిస్తే ఎక్కువ శాతం కాల్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్నాయని, వాటిలో 55 నుంచి 60 శాతం హెల్ప్ లైన్ కు వస్తున్నాయని కౌన్సిలర్లు అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచీ వచ్చే కేసుల్లో ఎక్కువ శాతం తప్పుడు వరకట్న వేధింపుల కేసులు ఉంటున్నాయని మరో కౌన్సిలర్ అమిత్ లఖాని అంటున్నారు. అంతేకాక ఎస్.ఐ.ఎఫ్ కు వచ్చే పురుషుల కాల్స్ లో ఎక్కువ శాతం పని ప్రదేశాల్లో లైంగిక దాడులకు సంబంధించినవి కూడా అయి ఉంటున్నాయని కౌన్సిలర్లు అంటున్నారు.
''ఒక వ్యక్తి నుంచీ మాకు కాల్ వచ్చింది. అతడి భార్య.. అతడు పని చేస్తున్న సంస్థకు ఫోన్ చేసి... అతడిపై వేధింపుల కేస్ ఫైల్ చేసినట్లు చెప్పిందట. దాంతో సంస్థవారు అతడ్ని ఎటువంటి వివరాలు అడక్కుండానే రిజైన్ చేయమన్నారు'' అంటూ ఎస్.ఐ.ఎఫ్ కౌన్సిలర్ లఖాని తెలిపారు.
ఢిల్లీలో న్యాయవాదిగా ఉన్న కులదీప్ బొబ్బర్ కూడా... సెక్షన్ 49-ఏ ను దుర్వినియోగం చేస్తున్న భార్యా బాధితుల కోసం ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సుమారు పది సంవత్సరాలుగా కనీసం నెలకు 50 నుంచి 60 కాల్స్ బాధితులనుంచి వస్తుంటాయని ఆయన చెప్పారు.
''ఇంటినుంచీ గెంటివేయబడ్డ ఓ వ్యక్తి నుంచీ నాకు కాల్ వచ్చింది. ఇంటిని తన పేరున మార్చుకున్న భార్య అతడిని ఇంటినుంచీ గెంటి వేసిందట. కనీసం తన పిల్లలను కూడా చూసేందుకు ఆమె...భర్తను రానివ్వడం లేదట. అంతేకాదు అతడిపై 25 వేధింపుల కేసులు కూడా బుక్ చేసిందట'' అంటూ న్యాయవాది కులదీప్ బొబ్బర్ ఓ బాధితుడి కేసును ఉదహరించారు. ఇటువంటి కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయని.. ఇప్పటికైనా పురుషులపై వేధింపుల విషయంలోనూ కళ్ళు తెరవాలని ఆయన సూచిస్తున్నారు.
అలాగే ఢిల్లీకి చెందిన మరో బాధిత మహిళల హెల్స్ లైన్ కు కూడా భార్యా బాధితులు కొందరు ఫోన్లు చేస్తున్నారని చెప్తోంది. సాధారణంగా అటువంటి కాల్స్ ...ఫాల్స్ డౌరీ కేసులై ఉంటున్నాయని వాటిని మరో హెల్స్ లైన్ కు పంపిస్తున్నామని వారు చెప్తున్నారు.
జర్నలిస్ట్, ఫిలిమ్ మేకర్ అయిన దీపికా భరద్వాజ్... సెక్షన్ 49-ఏ ను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఓ డాక్యుమెంటరీ కూడా తీస్తున్నారట. ఎటు చూసినా మానవ సంబంధాలు కరువైపోతున్న నేటి తరుణంలో బాధిత మహిళలకు న్యాయంపై ఎన్నో చట్టాలు ఉన్నాయని,... జీవిత భాగస్వాములైన మహిళలు, సహోద్యోగినుల వల్ల వేధింపులకు గురౌతున్న మగవారికి మాత్రం కనీస న్యాయం జరగడం లేదంటున్నారు.
తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ బాధితులు ఎంతోమంది కాల్స్ చేస్తుంటారని, మహిళలవల్ల వేధింపులకు గురై.. న్యాయం దొరకక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నవారి శాతం నానాటికి పెరుగుతోందని ఆమె చెప్తున్నారు. అందుకే బాధిత పురుషులకు హెల్ప్ లైన్లు ఎంతో అవసరమని దీపిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.