తొమ్మిదినెలలు భర్త, మామ నరకం చూపించారు
జంషెడ్‌పూర్: లింగ నిష్పత్తిలో చాలా వ్యత్యాసాలున్న బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హర్యానా, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో జరుగుతున్న వ్యాపారం, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిదర్శనం ఈ ఘటన. 15 ఏళ్ల బాలికను పెళ్లిచేసుకున్న ఓ వ్యక్తి, తన తండ్రితో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 9 నెలల పాటు ఆమెకు నిత్యం నరకం చూపించారు. చివరికి బాధితురాలి సోదరి చొరవతో పోలీసులు బాధితురాలిని రక్షించారు.
సునీత (మారుపేరు) జంషెడ్‌పూర్‌లోని ఓ మురికివాడలో పుట్టింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఈమె ఏనాడూ బడికి వెళ్లింది లేదు. సునీత తల్లి ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఈ నేపథ్యంలో హర్యానాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఆ కుటుంబాన్ని ప్రలోభపెట్టి, ఒక ఏజెంట్ ద్వారా లక్ష రూపాయలకు సునీతను కొనుక్కున్నాడు. తనకంటే 30 ఏళ్ల చిన్నదైన సునీతను బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ రాత్రి తండ్రితో కలిసి హింసించేవాడు. బెల్టుతో, చెప్పులతో తీవ్రంగా కొట్టేవారు. ఆమె హృదయ విదారకంగా రోదిస్తుంటే పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. తర్వాత ఇద్దరూ లైంగికదాడికి పాల్పడేవారు. ఇలా వారి అఘాయిత్యాలు 9 నెలల పాటు సాగాయి. చివరికి సునీతను పలకరించడానికి వచ్చిన ఆమె సోదరిపైనా దాడికి పాల్పడ్డారు. ఎలాగోలా బయటపడిన ఆమె స్థానిక స్వచ్ఛంద సంస్థ సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.
పెళ్లయిన మొదటి రోజు నుంచి భర్త, మామ తనను తీవ్రంగా హింసించేవారని, వారు కొట్టిన దెబ్బలతో తన ఒళ్లంతా హూనమయ్యేదని సునీత తెలిపింది. వదిలిపెట్టమని, పుట్టింటికి పంపించమని ఎంత వేడుకున్నా వినకుండా పైశాచికంగా ప్రవర్తించేవారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జార్ఖండ్ పోలీసులు ఆ మానవమృగాలను అరెస్ట్ చేయాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రిషికాంత్ డిమాండ్ చేశారు. ఏజెంట్‌ను కూడా అదుపులోకి తీసుకోవాలన్నారు.
కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక మహిళా పోలీసుస్టేషన్ అధికారి ప్రియాంక ఆనంద్ తెలిపారు. సునీతను మహిళా శిశు సంక్షేమ కమిటీ ముందు ప్రవేశపెడతామన్నారు. సునీత గర్భవతి అన్న వార్తల నేపథ్యంలో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం తరలించనున్నట్టు తెలిపారు.