అందుకే.. బిగ్‌బెన్ ధ్వని అంత మధురం
లండన్: లండన్‌లో ఉన్న అతి పెద్ద క్లాక్ టవర్ బిగ్‌బెన్. దీని నిర్మాణం జరిగి దాదాపు 160 ఏళ్లు గడుస్తున్నాయి. బిగ్‌బెన్ గంట సుమారు 13.7 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి నిత్యం ఇక్కడకి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఈ బిగ్‌బెన్ గురించి శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ గడియారంలోని గంట చేసే ధ్యని అంత మధురంగా ఎందుకు ఉంటుంది? అన్న విషయాన్ని లేజర్ సహాయంతో కనుగొన్నారు.
బిగ్‌బెన్‌లో గంటను మోగించడానికి 200 కిలోల బరువుండే సుత్తిని ఉపయోగిస్తారు. ఈ ప్రయోగం కోసం వారు రెండు లేజర్‌లను ఉపయోగించారు. వీటి సహాయంతో గంట నుంచి ఉత్పత్తి అయ్యే పౌనః పున్యాలను మ్యాపింగ్ చేసి ఒక యానిమేషన్‌ను రూపొందించారు. దీని ద్వారా గంట వెలువరించే విభిన్న కంపనాల నమూనాలను గుర్తించారు. ప్రత్యేక పౌనః పున్యాల వరుసల కారణంగా బిగ్‌బెన్ నుంచి శ్రావ్యమైన ధ్వని వెలువడుతుందని పరిశోధకులు గుర్తించారు. అదన్నమాట సంగతి! అందుకే, బిగ్‌బెన్ నుంచి వెలువడే ధ్వని అంత మధురంగా ఉంటుంది అని వివరించారు.