సమైక్య శంఖారావం సభ ఎలా పెడతారు ? : చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి తాను చేసిన పాదయాత్ర ఫలాలు అందేసమయానికి తనను రాజకీయంగా దెబ్బతీయడానికే కాంగ్రెస్ పార్టీ రాష్టవ్రిభజన నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని నిందించడానికే ఎక్కువ సమయం కేటాయించారు. సమైక్య శంఖారావం పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ హైదరాబాద్‌లో ఎలా సభ పెడుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావడం వల్లే జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిందన్నారు. జగన్ తాను సెక్యులరిస్‌ట అని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, సీపీఎం మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నాయని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నారని, అయితే ఈ విషయంలో ఆయన ఎన్నో టర్‌నలు తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు సాధించకపోతే ఆ పార్టీకి మనుగడ ఉండదన్నారు. కేంద్రంలో నోట్ తయారు కాకముందు అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు, జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌కు వినతిపత్రం అందచేశారని గుర్తుచేస్తూ అసెంబ్లీ సమావేశ పరిస్తే ఏమవుతుందో చెప్పలేదన్నారు. సమైక్యవాదం కోసం తానొక్కడినే పోరాడుతున్నట్లు జగన్ చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య మధ్యలో ఒక విలేకరుల సమావేశానికి పరిమితం అవుతున్నారని తెలిపారు. వీరెవరికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనీ, జేఏసీలను, భాగస్వాములను పిలిచి చర్చలు జరపాలని తాను విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. కాగా, ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తను ఇస్తున్నాం. సాక్షి ని అనుమతించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేది. మీరు సీమాంధ్రలో చేపట్టబోయే ఆత్మగౌరవ యాత్రలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతారా? కోరరా? సూటిగా సమాధానం చెప్పండి?
సమైక్యంగా ఉంచాలని కోరుతూ జేఏసీ తీర్మానం చేసి మీ వద్దకొస్తే సంతకం చేస్తారా? చేయరా?
అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడినందుకు ఐఎంజీ, ఎమ్మార్ లాంటి కుంభకోణాల్లో మీపై విచారణ జరగడం లేదన్న విమర్శలున్నాయి. మీరేమంటారు?
కేబినెట్ నోట్ రాకముందే రాష్ట్ర అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్యం కోసం తీర్మానం చేసి పంపాలన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదన మీకు రుచించినట్టు లేదు. సమస్య ప్రధానమైనప్పుడు మీరే అందుకు చొరవ తీసుకుంటే మిగతా పార్టీలు కలిసొస్తాయి కదా? మీరే ఎందుకు ఆ పని చేయరు?
ఏ టర్‌న, బీ టర్‌న, పీ టర్‌న అంటూ ఇలా ఇంకెన్ని టర్‌నలు తీసుకుంటారని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు కదా? ఇంతకూ మీ పార్టీ వైఖరేదో చెప్పి అందరి నోళ్లు మూయించొచ్చు కదా?