రెండేళ్ల తర్వాత పాదం బయటకు
డెహ్రాడూన్: జల ప్రళయం సంభవించి దాదాపు రెండేళ్ల తర్వాత కేదార్నాథ్ ఆలయం వద్ద మరోసారి చనిపోయినవారి అవశేషాలు బయటపడ్డాయి. ఓ వ్యక్తి కాలిబాగం ఆలయ ప్రాంగణంలో బయటపడింది. ప్రధాన ఆలయానికి 50 మీటర్ల దూరంలో కొందరు స్థానికులు శిథిలాలను తొలగిస్తుండగా ఇది కనిపించింది. 2013 జూన్ నెలలో హిమాలయ పర్వత పాద ప్రాంతాలను గంగా ప్రళయం ముంచెత్తిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో వేల మంది చనిపోగా వారిలో చాలామంది మృతదేహాలు కూడా ఆచూకీ లేకుండా పోయాయి. దాదాపు యాబై నుంచి అరవై అడుగుల మేర రాళ్లురప్పలు బురద మట్టి పేరుకు పోయింది. దీన్నంతటిని ప్రస్తుతం తొలగిస్తున్నారు. శనివారం దాదాపు 50 అడుగుల లోతు మేర తవ్వకాలు జరుపుతుండగా కాలిభాగం బయటపడింది. దానికి డీఎన్ఏ పరీక్ష చేసి అనంతరం దహనం చేశారు.