బాలికపై అత్యాచారం.. చర్చి ఫాదర్ కోసం గాలింపు
కేరళలో 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన చర్చి ఫాదర్ కోసం పోలీసులు పలు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. ఫాదర్ ఎడ్విన్ ఫిగర్జ్ జోసెఫ్ అనే వ్యక్తిపై ఏకంగా వాటికన్ సిటీ వరకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఎర్నాకులంలోని ఓ చర్చిలో గత జనవరి నుంచి మార్చి వరకు ఐదుసార్లు ఓ బాలిక కన్ఫెషన్ కోసం రాగా.. ఆ ఐదుసార్లూ ఆమెపై అతడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. అతడు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, హైకోర్టు తిరస్కరించింది. దాంతో మే 5 నుంచి అతడు పరారీలో ఉన్నాడు.
చర్చి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే పదో తరగతి విద్యార్థిని దాదాపు ఏడాది నుంచి ఆ ఫాదర్తో కలిసి పనిచేసేది. అయితే అతడీ అఘాయిత్యానికి పాల్పడటంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టే సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అతడి కోసం లుకౌట్ నోటీసు జారీ అయింది. అన్ని విమానాశ్రయాలు, సరిహద్దు చెక్పోస్టుల వద్ద కూడా అప్రమత్తం చేశారు.