వేధిస్తున్నారని భార్య, అత్త హత్య
సికింద్రాబాద్‌లో ఘటన
సాక్షి, హైదరాబాద్: తనను, తన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారనే కారణంతో ఓ వ్యక్తి తన భార్యను, అత్తను హతమార్చిన ఘటన సికింద్రాబాద్‌లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సికింద్రాబాద్ సెకండ్‌బజార్‌కు చెందిన శరవణన్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతను 2010లో బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తుండగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పద్మప్రియతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది.
అయితే కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి గొడవలు రేగాయి. దీంతో ఆమె భర్తతోపాటు అతని కుటుంబ సభ్యులు 15 మందిపై బెంగళూరులో 498ఏ సెక్షన్ కింద కేసు పెట్టింది. అతన్ని ఉద్యోగం నుంచి కూడా తీసేయించింది. దీంతో హైదరాబాద్‌కు వచ్చిన శరవణన్ సికింద్రాబాద్‌లోని సెకండ్‌బజార్‌లో ఉంటున్నాడు. పద్మప్రియకు అంతకుముందే మరోవ్యక్తితో పెళ్లి జరిగిన విషయం తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత ముదిరాయి. పద్మప్రియ బెంగళూరులో కోర్టుకెళ్లి భర్త తనతో సంసారం చేసేలా ఉత్తర్వులివ్వాలని పిటిషన్ వేసింది.
తనకు అనుకూలంగా తీర్పు రావడం తో హైదరాబాద్‌కు వచ్చిన పద్మప్రియ.. భర్తతో కలిసి సెకండ్‌బజార్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగింది. పోలీసుల జోక్యం తో కొద్దిరోజులు కాపురం సజావుగా సాగింది. అయితే శరవణన్‌తోపాటు అతని కుటుంబసభ్యులతో నిత్యం గొడవ పడేది. దీంతో శరవణన్ తన తల్లితో కలిసి శివాజీనగర్‌లో విడిగా ఉంటున్నాడు. మరోవైపు పద్మప్రియ తన తల్లి పరమేశ్వరి(60)తో కలిసి ఉంటోంది.
భార్య నుంచి నిత్యం వేధింపులు ఎదురవుతుండటం, కుటుంబ సభ్యులందరికీ మనశ్శాంతి కరువవడంతో ఆమెను హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చిన శరవణన్ తన సోదరుడు అయ్యప్ప, మేనమామ అంగముత్తులతో కలిసి పథకరచన చేశాడు. ఈలోగా బుధవారం రాత్రి 11.45 గంటల సమయంలో అంగముత్తు ఇంట్లో ఉన్న అతని కోసం పద్మప్రియ తన తల్లితో కలిసి వచ్చి గొడవకు దిగింది. అత్త అదే పనిగా తిట్టడంతో ఆగ్రహించిన శరవణన్ భార్య,అత్తను ఇనుపరాడ్‌తో తలపై కొట్టాడు. అనంతరం చున్నీని మెడకు బిగించి చంపాడు. కేసు దర్యాప్తులో ఉంది.