ఆమెతో నేను విసిగిపోయాను: డైరెక్టర్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్-కరణ్ జోహార్ మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న కోల్డ్‌వార్ సమసిపోయిందని భావిస్తే అది పొరపాటే. కాఫీ విత్ కరణ్ టీవీ షోలో ఆయన ఎదురుగానే కంగన తీవ్ర ఆరోపణలు చేసింది. ఆశ్రిత పక్షపాతానికి, బంధుప్రీతికి కరణ్ బాలీవుడ్‌లో నిలువెత్తూ ప్రతీక అంటూ కడిగిపారేసింది. ఈ విమర్శలు, ఆరోపణలపై మొదట మౌనం పాటించిన కరణ్ ఇటీవల లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రసంగిస్తూ స్పందించాడు.
'ఆమె నా షో అతిథి. ఆమె ఏం చెప్పినా వినాల్సిందే. ఆమెకు ఒక అభిప్రాయం కలిగి ఉండే హక్కు ఉంది. ఆమె నన్ను 'ఆశ్రిత పక్షపతానికి ప్రతీక' అంటూ నిందించింది. ఈ పదానికి ఆమెకు అర్థం తెలుసా? నేను ఏమైనా నా మేనల్లుళ్లు, కొడుకులు, కూతుళ్లు, కజిన్స్‌తో మాత్రమే సినిమాలు తీస్తున్నానా? నేను 15 మంది దర్శకులను బాలీవుడ్ పరిచయం చేశాను కదా? వారికి ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. తరుణ్ మన్సుఖనీ, పునీత్ మల్హోత్రా, శకున్ బత్రా, శశాంక్ ఖైతాన్ వంటివాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాను కదా. వారికి ఎలాంటి సినీ నేపథ్యం లేదు. వారికి ఒక వేదిక ఇచ్చి నిలబడేందుకు దోహదం చేశాను. ఇది ఆశిత్ర పక్షపాతానికి పూర్తి విరుద్ధమే కదా' అని కరణ్ పేర్కొన్నారు. ఆమె తీరుతో తాను విసుగెత్తిపోయానంటూ కరణ్ మండిపడ్డాడు.
'తాను మహిళనని, బాధితనని కంగన తరచూ చెప్తూపోతుండటం చూసి నేను విసుగెత్తిపోయాను. అస్తమానం నేను బాధితురాలినంటూ.. నన్ను సినీ పరిశ్రమ బెంబేలెత్తించిందని చెప్పడం సరికాదు. సినీ పరిశ్రమ అంత చెడ్డదైతే.. దానిని వదిలేయ్' అంటూ కరణ్ విరుచుకుపడ్డాడు. కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ 'మూవీ మాఫియా'ను నడుపుతున్నాడని, అతనికి ఆశ్రితపక్షపాతం, అసహనం ఎక్కువ అని, సినీ వారసులకే పెద్దపీట వేస్తాడని తీవ్రస్థాయిలో కంగన విమర్శలు చేసింది. ఇదంతా షోలో భాగం అనుకున్నారు చాలామంది కానీ, ఈ విమర్శలతో ఇద్దరి మధ్య విభేదాలు ముదిరాయని తెలుస్తోంది.