జయా బచ్చన్, కంగనా రనౌత్, రవి కిషన్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దగ్గర నుంచి బాలీవుడ్ ప్రశాంతంగా లేదు. ప్రతిభను తొక్కేస్తున్నారు... బాయ్‌కాట్ నెపోటిజమ్ అని మొన్న. బాలీవుడ్ స్టీరింగ్ ఓ గ్యాంగ్ చేతిలో ఉంది.. వాళ్లు ఎటు అంటేæఇండస్ట్రీ అటు తిరుగుతుందని నిన్న. బాలీవుడ్‌ను నడుపుతున్నది డ్రగ్స్ మత్తే అని ఈ మధ్య. ఇలా రకరకాల వివాదాలు. బాలీవుడ్ కాదు... వివాదాలవుడ్ అంటున్నారు చాలామంది. అయితే... ‘ఇండస్ట్రీలో కొందరు చేసిన తప్పుకు అందర్నీ తప్పుపట్టొద్దు’ అంటున్నారు జయాబచ్చన్.
ఆమె మాటలతో ఇండస్ట్రీలో పలువురు ఏకీభవించారు. కంగనా రనౌత్ కాదన్నారు. ఆ వివరాలు.
సుశాంత్ సింగ్ ఆత్మహత్య దగ్గర మొదలైన వివాదాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ వైపు మళ్లుతున్నాయి. మిస్టరీ నవలల్లోలా ఏదో ఒక కొత్త టాపిక్‌కి తెరలేస్తోంది. బంధుప్రీతిని ప్రోత్సహించడం వల్లే ప్రతిభకు చోటుండట్లేదు అని కొన్ని రోజులు చర్చ నడిచింది. ఆ తర్వాత డ్రగ్స్ మత్తులో ఇండస్ట్రీ మునిగి తేలుతోందని మరో కొత్త అంశం వెలుగులోకొచ్చింది. రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్ల జాబితాను పోలీసులకు అందించినట్టు వార్త. ఈ విషయం మీద నటుడు, యంపీ రవికిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఓ కొత్త వాదనలకు దారి తీసింది.
రవికిషన్ వర్సెస్ జయా బచ్చన్
‘బాలీవుడ్ ఇండస్ట్రీ మత్తు పదార్ధాలకు బానిస అవుతోంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు రవికిషన్. ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు నటి, యంపీ జయా బచ్చన్. ‘‘కొందరు చేసిన తప్పుకి ఓ పరిశ్రమ మొత్తాన్నీ నిందించడం కరెక్ట్ కాదు’’ అని మాట్లాడారామె. ఇదంతా మంగళవారం జరిగింది. జయ మాటలకు బుధవారం స్పందించారు రవికిషన్.
జయాజీ నాతో ఏకీభవించండి
‘నా ఉద్దేశం ఇండస్ట్రీలో అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని కాదు. కానీ తీసుకుంటున్న వాళ్ల ఉద్దేశమైతే పరిశ్రమను నాశనం చేయడమే. ఇండస్ట్రీ మీద ఉన్న బాధ్యతతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. జయాజీ కూడా నాతో ఏకీభవించాలి. ప్రస్తుతం డ్రగ్స్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. 90వ దశకంలో ఇలాంటివి జరగలేదు. ఇండస్ట్రీలో మురికిని తొలగించాలన్నది మా ముఖ్యోద్దేశం’’ అన్నారు రవి కిషన్.
జయా జీ... ఇది నా సొంత భోజనం: కంగనా
‘కొందరు సినీ ఇండస్ట్రీలో పెరిగి దాన్నే మురికి కాలువగా పిలుస్తున్నారని, ఇది భోజనం పెట్టిన చేతిని కరవడమే’ అని జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం స్పందించిన కంగనా బుధవారం కూడా తన విమర్శలను కొనసాగించారు. ‘‘ఏ భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు జయా జీ! రెండు నిమిషాల వేషం, ఐటమ్ నంబర్లు, ఒక రొమాంటిక్ సీన్ ఉండే భోజనమే ఇక్కడ దొరుకుతుంది, అది కూడా హీరోతో గడిపితేనే! నేను వచ్చి ఇండస్ట్రీకి ఫెమినిజమ్ నేర్పాను. మీరనే భోజనాన్ని దేశభక్తి చిత్రాలతో నింపాను. ఇది నా సొంత భోజనం, మీది కాదు’’ అని కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుంటే జయా బచ్చన్‌కి పలువురు తారలు మద్దతు పలికారు.
జయాజీ... యూ ఆర్ రైట్
‘ఎన్నో సామాజిక విషయాలకు ఇండస్ట్రీకి చెందిన చాలామంది అండగా నిలబడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం మాతో నిలబడాల్సిన సమయం ఇది. చెప్పాల్సిన విషయం సూటిగా, స్పష్టంగా చెప్పారు జయాజీ’ అన్నారు తాప్సీ. ‘బహుశా వెన్నెముక ఉండేవాళ్లు ఇలానే మాట్లాడతారేమో’ అని జయ మాటలను ప్రశంసించారు దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘జయాజీ మాట్లాడింది అక్షర సత్యం. ఇండస్ట్రీ కోసం ఆమె మాట్లాడటం చాలా సంతోషం’ అన్నారు దియా మిర్జా.
‘పెద్దయ్యాక నేనూ జయాజీలా అవ్వాలనుకుంటున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. ‘కంగనా.. పెద్దవాళ్లను గౌరవించాలన్న విషయం కూడా నీకు గుర్తులేదా? నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు.. వింటాను’ అన్నారు నటి స్వరా భాస్కర్. అలానే జయా బచ్చన్ వ్యాఖ్యలను నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, దర్శకుడు సుధీర్ మిశ్రా సమర్థించారు. ఈ వివాదం ఇంకెంత దూరమెళ్తుందో? ఎవరెవర్ని వివాదాల్లోకి లాగుతుందో? ఇండస్ట్రీని ఇంకెన్ని ఇబ్బందుల్లో పడేస్తుందో చూడాలి.
వివాదాలవుడ్‌గా మారిన బాలీవుడ్
ఇండస్ట్రీని ఏమైనా అంటే ఊరుకోను
– హేమా మాలిని
‘నాకు పేరు, గౌరవం, మర్యాద అన్నీ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీయే. అలాంటి ఇండస్ట్రీని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు’ అన్నారు సీనియర్ నటి హేమా మాలిని. ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్ ఓ అందమైన ప్రదేశం. సృజనాత్మక ప్రపంచం. ఈ ఇండస్ట్రీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు. డ్రగ్స్ లేనిదెక్కడ? ఒకవేళ మురికి ఉంటే కడిగితే పోతుంది. బట్టల మీద అంటుకున్న మురికి ఉతికితే పోతుంది. బాలీవుడ్ మీద పడ్డ మరక కూడా పోతుంది’’ అని అన్నారామె.
కంగనాకు సెక్యూరిటీ ఎందుకు – ఊర్మిళ
కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై (ముంబై పాకిస్తాన్‌ని తలపిస్తోంది. డ్రగ్స్ నిండిన బాలీవుడ్) మండిపడ్డారు నటిæఊర్మిళ. ‘డ్రగ్స్ సమస్య దేశమంతా ఉంది. కంగనాకు తెలుసు.. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే డ్రగ్స్ మొదలయిందని. తన సొంత ప్రాంతం నుంచే ఆమె డ్రగ్స్ పై యుద్ధం మొదలుపెట్టాలి. అసలు ఈమెకు వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ముంబై అందరిదీ. ఆ సిటీ గురించి తప్పుగా మాట్లాడితే ముంబై పుత్రికగా ఊరుకునేది లేదు. ఒక వ్యక్తి అదే పనిగా అరుస్తున్నాడంటే అతను నిజం చెబుతున్నాడని కాదు. కొంతమందికి ఊరికే అరవడం అలవాటు.. అంతే. ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడితే తమ కేం అవుతుందో అని చాలా మంది బయటకు రావట్లేదంతే’ అన్నారు ఊర్మిళ.
Comments
Please login to add a commentAdd a comment