బాలీవుడ్‌ పద్మాలు | Govt announces Padma Shri Awards 2020 | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ పద్మాలు

Published Sun, Jan 26 2020 12:50 AM | Last Updated on Sun, Jan 26 2020 4:50 AM

Govt announces Padma Shri Awards 2020 - Sakshi

కరణ్‌ జోహార్‌, అద్నాన్‌ సమీ, కంగనా రనౌత్‌, ఏక్తా కపూర్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే అవార్డుల జాబితాలో తెలుగు చిత్రసీమకు సంబంధించిన వారెవరూ లేకపోవడం గమనార్హం. హిందీ చిత్రసీమకు నాలుగు పద్మాలు వరించాయి. ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్, టీవీ టైకూన్‌ ఏక్తా కపూర్, ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్, ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సామీలను ‘పద్మశ్రీ’ వరించింది. శనివారం సాయంత్రం పద్మ అవార్డుల జాబితా వెలువడగానే ఈ నలుగురికీ ప్రశంసల వర్షం మొదలైంది.

కంగ్రాట్స్‌ కరణ్‌
ఇండస్ట్రీకి పరిచయమై.. ఓ పేరు సంపాదించాలని.. ఓ మార్క్‌ సృష్టించాలని ఏ కళాకారుడైనా కోరుకుంటాడు. కానీ దర్శకుడు కరణ్‌ జోహార్‌ బాలీవుడ్‌ పరిచయమే ఓ ల్యాండ్‌మార్క్‌. ఆయన బ్యానర్‌లో పరిచయం కావడం ఆర్టిస్టులకు ఓ హాల్‌మార్క్‌. షారుక్‌ ఖాన్‌ ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు కరణ్‌ జోహార్‌. రొమాంటిక్‌ డ్రామాలో ఆ సినిమా ఒక ట్రెండ్‌ సృష్టించింది.

ఆలియా భట్, సిద్ధార్థ్‌ మల్హోత్రా, వరుణ్‌ ధావన్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌ వంటి స్టార్‌ కిడ్స్‌ను కరణ్‌ ఇండస్ట్రీకు పరిచయం చేశారు. ప్రస్తుతం వాళ్లు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నారు.  నిర్మాత యశ్‌ జోహార్, హీరూ జోహార్‌ దంపతులకు జన్మించారు కరణ్‌. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే తిరిగారు, పెరిగారాయన. చిన్నప్పటి నుంచే సినిమాల ప్రభావం ఆయన మీద ఉంది.  షారుక్‌ ఖాన్‌ ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు కరణ్‌.

ఆ తర్వాత దర్శకుడిగా ‘కుచ్‌ కుచ్‌ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కభీ ఆల్విదా నా కెహ్నా, మై నేమ్‌ ఈజ్‌ ఖాన్, స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్, ఏ దిల్‌ హై ముష్కిల్‌’ సినిమాలు తెరకెక్కించారు. కరణ్‌ జోహార్‌కి స్క్రిప్ట్‌ని కమర్షియలైజ్‌ చేయడం తెలుసు. ఆడియన్స్‌ పల్స్‌ తెలుసు. అందుకే దర్శకుడిగా ఫ్లాప్‌ చూడలేదాయన. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు కరణŠ . ప్రస్తుతం బాలీవుడ్‌ పరిశ్రమలో ప్రముఖ పేరు కరణ్‌. 47 ఏళ్ల కరణ్‌ పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా (యష్, రూహీ) ఇద్దరు పిల్లలున్నారు.

శభాష్‌ సమీ
‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలో ‘ఏ జిల్లా ఏ జిల్లా... ఓ పిల్లా నీదీ ఏ జిల్లా’ పాట విన్న శ్రోతలకు ఆ పాట పాడిన గాయకుడి గొంతు కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఆ గొంతు రెగ్యులర్‌గా లేదు. విభిన్నంగా అనిపించింది. కానీ పాడుతుంటే వినాలనుంది. శభాష్‌.. గొంతు బాగుందన్నారు. ఆ గాయకుడి జిల్లా ఏంటి? అని వాకబు చేశారు. అతని పేరు అద్నాన్‌ సమీ అని తెలిసింది. లండన్‌లో పుట్టి పెరిగారు అద్నాన్‌ సమీ. అఫ్ఘాన్‌ మూలాలున్న తండ్రి, జమ్మూ కశ్మీర్‌ మూలాలున్న తల్లికి జన్మించారు ఆయన.

తొమ్మిదేళ్లకే పియానో వాయించడం మొదలుపెట్టారు సమీ. హాలిడేలో ఇండియాను సందర్శించినప్పుడు క్లాసికల్‌ మ్యూజిక్‌పై ఆసక్తి ఏర్పరుచుకొని నేర్చుకున్నాడు అద్నాన్‌. తన చురుకుతనాన్ని గమనించి సంగీతంలోనే కొనసాగమని ప్రముఖ గాయని ఆశా భోంస్లే సూచించారు. అప్పటి నుంచి సంగీతంలో మరింత శ్రద్ధపెట్టారు. ఇండియన్, వెస్ట్రన్‌ క్లాసిక్‌ మ్యూజిక్‌లో పట్టు సాధించారు. ‘నౌషద్‌ మ్యూజిక్‌’ అవార్డు అందుకున్న పిన్న వయస్కుడు అద్నానే. అద్నాన్‌ తొలి కంపోజిషన్‌ 1986లో ‘రన్‌ ఫర్‌ లైఫ్‌’ సాంగ్‌ సూపర్‌ హిట్‌ అయింది.

1995లో ‘సర్గం’ అనే పాకిస్థానీ సినిమాకు సంగీతం అందించారు. అందులో నటించారు కూడా. అది బ్లాక్‌బస్టరే. ‘కబీతో నజర్‌ మిలావో’ అనే ప్రేమ పాటల్ని ఆశా భోంస్లేతో కలసి ఆల్బమ్‌గా చేశారు. శ్రోతల్ని ఉర్రూతలూగించింది. 2001 నుంచి బాలీవుడ్‌ సినిమాలకు పాడటం, కంపోజ్‌ చేయడం మొదలుపెట్టారు అద్నాన్‌ సమీ. 2004లో ‘శంకర్‌ దాదా’తో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘నచ్చావే నైజాం పోరీ (వర్షం), భూగోళమంతా సంచిలోనా (శంకర్‌ దాదా జిందాబాద్‌), కళ్లూ కళ్ళూ ప్లస్‌ (100ç% లవ్‌), ఓ ప్రియా ప్రియా (ఇష్క్‌), ఓ మధు ఓ మధు (జులాయి) వంటి పాపులర్‌ పాటలు పాడారాయన.

సక్సెస్‌ఫుల్‌ క్వీన్‌
బాలీవుడ్‌లో కంగనా ఫైర్‌ బ్రాండ్‌. అనుకున్నది అనుకున్నట్లే చెబుతుంది. ఏవరేమనుకుంటే ఏంటి? అంటుంది. ఎవరు చిన్నబుచ్చుకున్నా,  తన అభిప్రాయాలను వెలిబుచ్చడంలో ఎప్పుడూ సంకోచించదు కంగనా. డాక్టర్‌ అవ్వాలని ఇంట్లో అన్నారు. యాక్టర్‌ అవుతాను అంది కంగనా. ఇంట్లో వద్దన్నారు. నా ఆశను వదలనంది కంగనా. గాడ్‌ ఫాదర్‌ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకుంది కంగనా. వచ్చిన అవకాశాలను మెట్లుగా చేసుకుని సూపర్‌ స్టార్‌గా ఎదిగింది.

‘గ్యాంగ్‌స్టర్‌’(2006) సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైంది కంగనా. 2007లో ‘లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో’ చిత్రం తనకు కావాల్సిన గుర్తింపుని ఇచ్చింది. ఆ మరుసటి ఏడాదే మధుర్‌ బండార్కర్‌ తీసిన ‘ఫ్యాషన్‌’ సినిమాలో సహాయనటిగా జాతీయ అవార్డు అందుకుంది కంగనా. ప్రభాస్‌ ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమాతో తెలుగులోనూ పరిచయమైంది. ‘క్వీన్, తను వెడ్స్‌ మను’ సినిమాలకు జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది.

కంగనా కేవలం నటిగానే కాదు ‘క్వీన్‌’ సినిమాకు మాటల రచయితగా, సిమ్రాన్‌కి సహ రచయితగా, ‘మణికర్ణిక’ సినిమా కొంత భాగానికి దర్శకత్వం వహించి, దర్శకురాలిగా తన ప్రతిభను చూపించింది. ప్రస్తుతం కంగనా చేతిలో ఉన్న రెండూ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలే. ఫోర్బ్స్‌ ఇండియా 100 లిస్ట్‌లో ఆరు సార్లు చోటు సంపాదించారామె. ఆమె ఫ్యాషన్‌ సెన్స్‌ విచిత్రంగానూ, స్టయిల్‌ స్టేట్‌మెంట్‌లా ఉంటుంది. ఆమె స్టెట్‌మెంట్లు ఎక్కువ శాతం కాంట్రవర్శీలకు దారి తీసిన సందర్భాలున్నాయి. ఈ కాంట్రవర్శీ క్వీన్‌కి తిరుగులేదు. సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నారు.


టెలివిజన్‌ స్టార్‌
నిర్మాణం రిస్క్‌తో కూడుకున్నది. టెన్షన్స్‌తో కూడుకున్నది. కూడికలు, తీసివేతలతో కూడుకున్నది. మనుషుల్ని డీల్‌ చేయాలి. టెన్షన్‌ను హ్యాండిల్‌ చేయాలి. అందులో రాణించడం చాలా కష్టం. కానీ బాలీవుడ్‌ నిర్మాణంలో రాణిగా వెలుగుతున్నారు ఏక్తా కపూర్‌. సీరియల్స్, సినిమాలు, వెబ్‌ షోలు ఇలా ఎడతెరిపి లేకుండా కంటెంట్‌ని బుల్లితెరపై కురిపిస్తూ టెలివిజన్‌ క్వీన్‌గా ఉన్నారు ఏక్తా.  బాలీవుడ్‌ నటుడు జితేంద్ర, శోభా కపూర్‌ కుమార్తె ఏక్తా కపూర్‌.

15 ఏళ్లకే దర్శకుడు కైలాష్‌ సురేంద్రనాథ్‌ దగ్గర చేరింది ఏక్తా. 1994లో తండ్రి ఇచ్చిన కొంత డబ్బును, తన ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి బాలాజీ టెలీ ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థ స్థాపించింది ఏక్తా. సీరియల్స్‌ మీద సీరియల్స్‌. ఆ తర్వాత సినిమా నిర్మాణంలోకి దిగింది. బాలాజీ టెలీ ఫిలింస్‌ ద్వారా దాదాపు 130 సీరియల్స్‌ను నిర్మించింది. అందులో కొన్ని సీరియల్స్‌ పలు ప్రాంతీయ భాషల్లోనూ డబ్బింగ్‌ అయ్యాయి. ఆమె నిర్మించినవాటిలో ‘హమ్‌ పాంచ్, కహానీ ఘర్‌ ఘర్‌ కీ, జోధా అక్బర్, నాగినీ, కుంకుమ్‌ భాగ్య, కుందలీ’ వంటి పాపులర్‌ టీవీ సీరియల్స్‌ కొన్ని.

సినిమాలు స్టయిల్‌ వేరు, సీరియల్స్‌ స్టయిల్‌ వేరు. సీరియల్స్‌లో ఎప్పటికప్పుడు సరుకు తయారవుతూనే ఉండాలి. అందుకే ఆమెను క్వీన్‌ ఆఫ్‌ టెలివిజన్‌ అంటారు. 2017లో ఎల్‌టీ బాలాజీ డిజిటల్‌ యాప్‌ స్టార్ట్‌ చేసి, ఇప్పటివరకు సుమారు 40 షోలు అందించింది. ‘హమ్‌ పాంచ్‌’ సీరియల్‌ ద్వారా విద్యా బాలన్‌ను పరిచయం చేసింది ఏక్తా. టెలివిజన్‌ ఇండస్ట్రీలో మోస్ట్‌ పవర్‌ఫుల్‌ లేడీగా ఎదిగింది ఏక్తా. 44 ఏళ్ల ఏక్తా కపూర్‌ పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా ఓ బాబుకి తల్లయ్యారు.
– గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement