మోడీలా నేను దాచలేదు
* ఆయన తన పెళ్లి బంధాన్ని 30 ఏళ్లు దాచాడు
* నేను మోడీలా పిరికివాడిని కాదు: దిగ్విజయ్
* విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం నాకుంది
* అమృతకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటా
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతారాయ్‌తో తనకున్న సంబంధాన్ని ఏనాడూ దాచలేదని, ఆమెకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటానని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలా తానేమీ దాచలేదన్నారు.
‘నేను మోడీలా పిరికివాడిని కాదు. పెళ్లి సంబంధాన్ని 30 ఏళ్లపాటు దాచలేదు. పెళ్లి అంశం ప్రైవేటు వ్యవహారం. అయినప్పటికీ బహిర్గతపరిచేందుకు వెనుకాడలేదు. దీనిపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం నాకుంది. అమృతకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటా’ అని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. పోలింగ్ రోజున మోడీ తన పార్టీ గుర్తును చూపడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. చట్టాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించడం ఆయనకు అలవాటేనని ధ్వజమెత్తారు.
అంతకుముందు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో జరిగిన వేడుకల్లోనూ దిగ్విజయ్ మాట్లాడారు. కార్మికులంటే కాంగ్రెస్‌కు ఎంతో గౌరవం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ 5 శాతానికిపైగా వృద్ధిరేటును సాధించిన ఘనత యూపీఏ సర్కార్‌దేనన్నారు. అయితే దీనివల్ల కార్పొరేట్లు ఎక్కువగా లబ్ధి పొందిందన్నారు. పేదల కోసం యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చే సమయంలో కార్పొరేట్ శక్తులు తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. ప్రస్తుతం ఆ శక్తులే ఎన్నికల్లో మోడీకి మద్దతిస్తున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణ, సీమాంధ్రలో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించుకున్నారు. వైఎస్ గొప్ప నాయకుడని, కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారని కొనియాడారు. అనంతరం పలువురు కార్మిక నాయకులను టీపీసీసీ తరఫున సన్మానించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పలువురు ఐఎన్‌టీయూసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు దిగ్విజయ్ పెళ్లి ఆయన వ్యక్తిగత విషయమంటూ ఏఐసీసీ నేతలు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇక దిగ్విజయ్ కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ మాత్రం తన తండ్రికి మద్దతు తెలిపారు. ఆయన వ్యక్తిగత నిర్ణయంలో తాను జోక్యం చేసుకోబోనన్నారు.