పనికిరాదని నేనే కోసేసుకున్నా: స్వామి
కేరళ ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తన జననాంగాన్ని న్యాయవిద్యార్థిని కోయలేదని, అది తనకు ఎటూ పనికిరాదన్న ఉద్దేశంతో తానే కోసేసుకున్నానని 54 ఏళ్ల గణేశానంద తీర్థపద స్వామి తాజాగా చెప్పారు. ఈ కేసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆస్పత్రిలో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో మరో విషయం కూడా పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. ఈ స్వామి గత ఏడేళ్లుగా ఆ యువతిపై పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, అందుకే విసుగు చెందిన ఆమె ఈ దాడి చేసిందని అంటున్నారు.
ఎవరీ స్వామి.. ఎక్కడివాడు?
15 ఏళ్ల క్రితం ఆధ్యాత్మిక గురువుగా మారడానికి ముందు కేరళలోని ఎర్నాకులం జిల్లా కొల్లెంచెరి ప్రాంతంలో ఒక టీ స్టాల్ నడుపుకొనేవాడు. ఇప్పుడు ఆ దుకాణాన్ని ఆయన సోదరుడు నడుపుతున్నాడు. ఆరేళ్ల క్రితం ఆయన చివరిసారిగా తన స్వగ్రామానికి వెళ్లాడు. హిందూ ఐక్యవేది అనే సంస్థతో గణేశానందకు సంబంధాలుండేవి. కేరళలో సంఘ సంస్కర్త అయిన చట్టాంబి స్వామి జన్మస్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేయడంతో పాటు వరుసపెట్టి ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా గణేశానంద ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత కేరళ అదనపు డీజీపీ డాక్టర్ బి. సంధ్యపై హిందూ సంస్థలు చేసిన ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు. ఆ ఉద్యమ సమయంలోనే ప్రస్తుతం ఆయన జననాంగం కోసేసినట్లు చెబుతున్న యువతి కుటుంబంతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. యువతి తల్లి ఆయనను పూజల కోసం ఇంటికి పిలిచేవారని పోలీసులు చెప్పారు. అనారోగ్యంతో ఉన్న ఆమె భర్తకు బాగుచేస్తానని చెప్పి ఆశ్రమానికి తీసుకెళ్లి, ఆమె కుమార్తెను లైంగికంగా దోచుకున్నాడని ఆ పోలీసు అధికారి చెప్పారు.