కోసిపారేసిన యువతికి సీఎం అభినందన
అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి పురుషాంగాన్ని కోసిపారేసిన యువతి సాహసాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు. ఆమె చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, అందులో అనుమానం ఏమీ లేదని చెప్పారు. తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన ఒక దొంగస్వామి మర్మాంగాన్ని కేరళకు చెందిన న్యాయ విద్యార్థిని కోసి పారేసిన విషయం తెలిసిందే. కొల్లాంలోని పన్మన ఆశ్రమంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
గణేశానంద తీర్థపద స్వామి (54) అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఎంత వారించినా వినకపోవడంతో ఆమెకు కోపం వచ్చి తన వద్ద ఉన్న చాకుతో అతడి పురుషాంగాన్ని కోసేసింది. తిరువనంతపురం పోలీసులకు ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పగా, వాళ్లు కూడా ఆమెపై కేసు ఏమీ నమోదు చేయకుండా అతడిపైనే పోస్కో కేసు పెట్టారు. కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కూడా ఆ యువతిని అభినందించారు. మతం పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.