లాలూ కుటుంబంపై ఐటీ కొరడా
బినామీ చట్టం కింద రూ.180 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరుగురు కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కొరడా ఝుళిపించింది. రూ.1,000 కోట్ల భూముల క్రయవిక్రయాలకు సంబంధించి పన్ను ఎగవేతపై బినామీ లావాదేవీల (నియంత్రణ) చట్టం కింద వారి ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు లాలూ సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమార్తె మిసా భారతి, అల్లుడు శైలేశ్‌కుమార్, కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, కుమార్తెలు చందా, రాగిణియాదవ్‌లకు ఐటీ నోటీసులు జారీ చేసింది. బినామీ లావాదేవీల చట్టం–2016 సెక్షన్ 24(3) కింద ఈ నోటీసులిచ్చింది.
బినామీ ఆస్తుల వల్ల లాలూ వారసులు ప్రయోజనం పొందారన్న అభియోగంపై ఈ చర్యలు తీసుకుంది. ఐటీ శాఖ అటాచ్ చేసిన వాటిల్లో ఢిల్లీ, బిహారుల్లోని రూ.9.32 కోట్ల విలువైన డజను ఖాళీ స్థలాలు, భవంతులు ఉన్నాయి. వీటిల్లో ఢిల్లీ న్యూఫ్రెండ్స్ కాలనీలోని నివాస భవనం, పట్నా పుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని 9 ప్లాట్లు, ఫామ్‌హౌస్ ఉన్నాయి. ఈ ఆస్తుల మార్కెట్ విలువ రూ.170–180 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. ప్రభుత్వ అనుమతితో అటాచ్ చేసిన ఆస్తులను జప్తు చేసుకొనేందుకు ఐటీ శాఖ సమాయత్తమవుతోంది. ఈ చట్టం కింద నేరం రుజువైతే ఏడేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, ఆస్తుల మార్కెట్ విలువలో 25 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది.
గత నెలలో లాలూ బినామీ ఆస్తులపై ఐటీ దేశవ్యాప్తంగా సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాలు తనను భయపెట్టలేవని, తన వాగ్ధాటిని ఎదుర్కొనే దమ్ము లేకే బీజేపీ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని నాడు లాలూ వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటివి తెరపైకి వస్తున్నాయని తేజస్వీ పట్నాలో వ్యాఖ్యానించారు. కాగా, గత మే 23 నాటికి దేశ వ్యాప్తంగా 400 బినామీ కేసులను ఐటీ శాఖ గుర్తించింది. వీటిల్లో 240 కేసులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది. వీటి మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.