
సినీ ప్రమోషన్‌లో లైంగికంగా వేధించారు: నటి
బాలీవుడ్‌లో మంచినటిగా అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర సంపాదించుకుంది స్వర భాస్కర్. మసాలా సినిమా అయినప్పటికీ మహిళల సమ్మతి కూడా ముఖ్యమనే విషయాన్ని ఆమె తాజా సినిమా ‘అనార్కలి ఆఫ్ ఆర్హా’ లో చెప్పింది. ఆ తర్వాత ఫెమినిస్టుగా తన గొంతు వినిపించింది. ఇప్పుడు ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా లైంగికంగా వేధింపులకు గురైన విషయాన్ని ధైర్యంగా వెల్లడించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ప్రేమ్‌రతన్ ధన్‌పాయో సినిమా ప్రమోషన్ సందర్భంగా రాజకోట్‌లో తన పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది.
2015లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ’ప్రేమ్‌రతన్ ధన్‌పాయో’లో స్వర సల్మాన్ సవతి సోదరిగా నటించింది. ‘సినిమా ప్రమోషన్ సందర్భంగా నేను సల్మాన్ సర్‌తో కలిసి ప్రయాణించాను. రాజ్‌కోట్ విమానాశ్రయంలో ఆయనను చూసేందుకు దాదాపు రెండువేల మంది చుట్టుముట్టారు. ఈ సందర్భంగా మూగిన కొందరు నన్ను లైంగికంగా తాకేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ ఉన్నా లాభం లేకపోయింది. అల్లరిగా ఉన్న అక్కడి నుంచి బయటపడి నేను కారులో ఎక్కేందుకు అక్కడే ఉన్న అనుపమ్ ఖేర్ సహాయపడ్డారు’ అని స్వర తెలిపారు. అంతకుముందు ముంబై రైల్లో ఓ తాగుబోతు తనముందే లైంగిక అసభ్య చర్యలకు పాల్పడ్డాడని, మొదట భయపడినా అతన్ని పోలీసులకు పట్టించేందుకు ప్రయత్నించానని, కానీ అతను తప్పించుకొని పారిపోయాడని తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.