
బోర్డుపై మిస్త్రీ ఈమెయిల్ అస్త్రం!
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన సరైస్ మిస్త్రీ ఎట్టకేలకు స్పందించారు.
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన సరైస్ మిస్త్రీ ఎట్టకేలకు స్పందించారు. చైర్మన్ పదవి నుంచి తనను తొలగించిన పద్ధతి షాక్ గురిచేసిందంటూ బోర్డు సభ్యలకు ఆయన ఈమెయిల్ సంధించారు. ఇలా తనను తొలగించడం బోర్డుకు ఏమాత్రం శోభకరం కాదని పేర్కొన్నారు. కనీసం తన వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశంలో అసాధారణ విపరీత చర్య అంటూ బోర్డు మీద మండిపడ్డారు. టాటా బోర్డులో తొమ్మిది మంది సభ్యలు ఉండగా.. అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనను సమర్థించిన విషయం తెలిసిందే.
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒక్కటైన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగించి.. ఆయన స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమించిన సంగతి తెలిసిందే. అత్యంత అవమానకరరీతిలో తనను తొలగించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని మిస్త్రీ భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, మిస్త్రీ లీగల్‌చర్యలు తీసుకోకుండా టాటా గ్రూప్ కూడా జాగ్రత్తలు తీసుకోంటుంది. లీగల్ చర్యలు నివారించేందుకు ఉద్దేశించిన కేవియట్ పిటిషన్లను బొంబాయి హైకోర్టులో టాటా గ్రూప్ దాఖలు చేసింది. అయితే, ప్రస్తుత దశలో లీగల్ చర్యలు తీసుకొనేందుకు మిస్త్రీ సిద్ధపడటం లేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. టాటా కంపెనీ ఆస్తులను అమ్మడం, ముఖ్యంగా రతన్ టాటా కొనుగోలు చేసిన యూకే స్టీల్ పరిశ్రమను అమ్మడం వల్లే టాటాలకు మిస్త్రీపై కోపం వచ్చిందని, అందుకే ఆయనను అర్ధంతరంగా తొలగించినట్టు రతన్ టాటా లీగల్ అడ్వైజర్ హరీష్ సాల్వే తెలిపారు.