ఐడీబీఐ బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మంగళవారం సవరించింది. సవరించిన రేట్లు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి.
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మంగళవారం సవరించింది. సవరించిన రేట్లు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి. దీర్ఘకాల టర్మ్ డిపాజిట్లపై రేట్లను అర శాతం పెంచామని, కొన్ని టర్మ్ డిపాజిట్లపై రేట్లను పావు శాతం తగ్గించామని బ్యాంకు తెలియజేసింది. దీని ప్రకారం 7 నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను 9 శాతానికి పెంచుతున్నారు. 5-7 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీరేట్లను 8.75 శాతం నుంచి 9 శాతానికి పెంచారు. 501 రోజుల నుంచి 5 ఏళ్ల లోపు అన్ని కాల పరిమితుల డిపాజిట్లపై ఒకే వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నామని, వీటిపై 9% వడ్డీనిస్తామని బ్యాంకు వివరించింది. గతంలో ఈ సెగ్మెంట్‌లో మూడు రకాల వడ్డీరేట్లు ఉండేవి. 500 రోజుల డిపాజిట్లపై చెల్లిస్తున్న వడ్డీరేటును 9.40% నుంచి 9.30 శాతానికి (0.10%)తగ్గించామని ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది.