
ఆ పదవులకు పోటీ వద్దు: వైఎస్ జగన్
పులివెందుల: రాజ్యాంగపరంగా అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, స్పీకర్ పదవులకు పోటీ ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అత్యున్నత పదవులు ఏకగ్రీవమైతే వాటి హుందాతనం పెరుగుతుందన్నారు. తటస్థంగా ఉండే వారే ఆ పదవుల్లో ఉండాలని ఆశిస్తామని, అందుకే ఏకగ్రీవానికి మద్దతు పలుకుతామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావుకు అందుకే మద్దతు ఇచ్చామని, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అన్ని పార్టీలు మద్దతు ఇస్తే తటస్థంగా ఉంటారన్న ఆశ కలుగుతుందని చెప్పారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. పదవుల్లో ఉన్న వారు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. తమ పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసుపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...
- సీఎం పదవిలో ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు రేపు మేం గెలవొచ్చు
- ఎవరు అధికారంలో ఉన్నా 5 కోట్ల మంది ప్రజల్లో ఒకరికే సీఎంగా ఉండే అవకాశం దేవుడు ఇస్తాడు
- అలాంటి పదవుల్లో ఉన్నవారు ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలి
- ఎవరైనా ప్రజలకు మంచి చేయాలి
- ప్రజల ఆశీస్సులతో, దేవుడి దీవెనలతో సీఎంగా ఎన్నిక కావాలి
- ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం, వారిపై అనర్హత వేటు పడకుండా చూడటం సరికాదు
- చంద్రబాబు పరోక్షంగా సహకరించబట్టే పత్తికొండలో హత్యలు జరిగాయి
- డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి నియోజకవర్గంలో హత్య జరిగింది
- నారాయణరెడ్డి లైసెన్స్ రెన్యువల్ కోసం వెపన్ తీసుకున్నారు
- ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినా వెపన్ తిరిగి ఇవ్వలేదు
- దీన్నిబట్టి చూస్తే పథకం ప్రకారం హత్య జరిగినట్టు తెలుస్తోంది
- ఇసుక మాఫియాపై నారాయణరెడ్డి యుద్ధం చేశారు
- కేఈ కుమారుడిపై విచారణకు హైకోర్టు ఆదేశించింది
- ఇలాంటి నేపథ్యంలో భద్రత కోసం నారాయణరెడ్డి పదేపదే వేడుకున్నారు
- కోర్టు ఆదేశాలతో సెక్యురిటీ ఇస్తే మూడు నెలల్లో తొలగించారు
- రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటివారిని ప్రేమించడం కూడా చేయాలి
- వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో పత్తికొండలో గెలిచే పరిస్థితి వస్తుంది
- ఒకర్ని చంపితే అభ్యర్థి లేకుండా పోతారా? నాయకుడు లేకుండా పోతాడా?
- నారాయణరెడ్డి హత్యపై సీబీఐతో దర్యాప్తు జరపాలి
- నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం నిందితుడు
- కేఈకి చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయి
- సీబీఐతో విచారణ చేయిస్తేనే న్యాయం జరుగుతుంది
- పోలీసులు విచారణ వల్ల ఎవరికీ మేలు జరగదు