నేను అసెంబ్లీకి ఎందుకు రావాలి?
కోల్ కతా: రాష్ట్ర అసెంబ్లీలో అసలు చర్చించాల్సిన అంశాలే లేనప్పుడు తాను అసెంబ్లీకి వచ్చి ప్రయోజనం ఏమిటని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వామ పక్షాలపై మండిపడ్డారు. 'అక్కడ(అసెంబ్లీ)లో ప్రతి పక్షాలు నన్ను ప్రశ్నించడానికి ఏ విధమైన అంశాలు లేవు. నా మంత్రి వర్గ విభాగాలకు సంబంధించి చర్చించడానికి కూడా ఎటువంటి సబ్జెక్ట్ వారి వద్ద లేదు. మరి నేను అసెంబ్లీకి వచ్చి ప్రయోజనం ఏమిటి' అని మమత ప్రశ్నించారు. ఈ రోజ్ లెఫ్ట్ పార్టీలు మమత అసెంబ్లీ గైర్హాజరీపై ఆందోళనకు దిగాయి. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తూ వామపక్ష సభ్యులు శుక్రవారం వాకౌట్ చేశారు.
దీంతో స్పందించిన మమత.. తాను త్వరలో అసెంబ్లీకి వస్తానని తెలుపుతూనే, అసలు అక్కడ చర్చించాల్సినది ఏమీ లేదని పరోక్షంగా లెఫ్ట్ పార్టీలను ఎద్దేవా చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ సమయం కేటాయిస్తానని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అసలు లెఫ్ట్ పార్టీల దగ్గర భూ వివాదానికి సంబంధించి ఒకే ప్రశ్న మాత్రమే ఉందని, అది కూడా కోర్టు పరిధిలోనే ఉందని ఆమె గుర్తు చేశారు.