
అక్రమ ప్రాజెక్టులను ఆపే దమ్ముందా?
టీడీపీ నేతలకు జితేందర్‌రెడ్డి సవాల్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను మిత్రపక్షం బీజేపీతో మాట్లాడి ఆపించే దమ్ముందా? అని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి టీటీడీపీ నేతలకు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటే కర్ణాటక కడుతున్న ప్రాజెక్టులను ఆపించాలని, లేకపోతే తెలంగాణ లో టీడీపీకి నైతిక అర్హత లేనట్లేనన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు.
కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా రోడ్డు బ్రిడ్జిలు అంటూ బ్యారేజీలను నిర్మిస్తుందన్నారు. ఇది నిర్మిస్తే తెలంగాణకు కృష్ణాజలాలు రావన్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలమంతా కేంద్రం తో పోరాటం చేస్తామన్నారు. టీడీపీ తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రాజెక్టుల యాత్ర చేయడం ఆపి కేంద్రంలో ఉన్న మిత్రపక్షం బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి ఆపించాలని హితవుపలికారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అక్రమంగా కలుపుకున్నప్పుడు టీడీపీ అఖిలపక్ష సమావేశం పెట్టిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ విభజన సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేశామని, హైకోర్టును విభజించాలనే డిమాండ్‌తో పార్లమెంట్‌ను స్తంభింపజేశామన్నారు.
రూ.1250 కోట్ల తెలంగాణకు చెందిన ఆదాయపన్ను నిధులను ఏపీకి మళ్లించడాన్ని ప్రశ్నిం చామని తెలిపారు. తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో ఎలాంటి విభేదాలు లేవని అందరిని కలుపుకుపోతానని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎమ్మెల్యేలు మనస్తాపానికి గురైన విషయాన్ని సీఎం కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు.